Andhra Pradesh: మార్గదర్శి కేసులో రామోజీరావుకు ఇబ్బందే.. భారీ జరిమానా కట్టాల్సి ఉంటుంది!: ఉండవల్లి అరుణ్ కుమార్
- రామోజీ రావుపై రెండు కేసులు ఉన్నాయి
- 99 శాతం నగదును వెనక్కు ఇచ్చినట్లు ఆయన చెప్పారు
- స్టే గడువు 6 నెలల్లో ముగిసిపోతుంది
మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను నిలిపివేయాలని కంపెనీ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈ రోజు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో అసలు మార్గదర్శి కేసును వెలుగులోకి తెచ్చిన కాంగ్రెస్ నేత, పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవస్థాపకులు, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుపై ప్రధానంగా రెండు కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు. నిబంధనలు అతిక్రమించి బయటి వ్యక్తుల నుంచి నిధులను సేకరించి.. వాటిని తన వద్ద ఉంచుకున్నట్లు రామోజీరావుపై అభియోగాలు ఉన్నాయని తెలిపారు.
ఈ వ్యవహారంపై కేసు నమోదు కావడంతో ప్రజల నుంచి సేకరించిన రూ.2,600 కోట్ల డిపాజిట్లలో 99 శాతం నగదును వెనక్కి ఇచ్చేసినట్లు రామోజీరావు చెప్పారని ఉండవల్లి అన్నారు. అయితే కేసుల్లో సివిల్ ప్రొసీడింగ్స్, క్రిమినల్ ప్రొసీడింగ్స్ వేరుగా ఉంటాయని ఆయన తెలిపారు. నగదు వెనక్కు ఇచ్చేసినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలోని సెక్షన్ 45 ఎస్ ప్రకారం ఎంత డిపాజిట్లు వేశారో దానికి రెండున్నర రెట్లు అంటే రూ.6,500 కోట్లు జరిమానా కట్టాల్సి ఉంటుందని వెల్లడించారు. సాధారణంగా ఏ స్టే అయినా 6 నెలల్లో ముగుస్తుందని స్పష్టం చేశారు.
అలాగే రెండేళ్ల జైలుశిక్ష కూడా పడే అవకాశముందన్నారు. అయితే ఈ క్రిమినల్ విచారణపై సీఆర్పీసీ సెక్షన్ 291 కింద మార్గదర్శి సంస్థ హైకోర్టులో స్టే తెచ్చుకుందని పేర్కొన్నారు. తాజాగా సుప్రీంకోర్టు ఉత్తర్వులతో స్టే ఆర్డర్ తొలగిపోయిందన్నారు. నాంపల్లిలో కేసు నమోదయితే తెలంగాణ ప్రభుత్వాన్ని ఇంప్లీడ్ చేయకుండా కేవలం ఏపీనే ఇంప్లీడ్ చేశారన్నారు. రామోజీ రావు నగదును వెనక్కు ఇచ్చేస్తామని కోర్టుకు చెప్పడంతో ఆయన్ను వేధించవద్దనీ, కేసును మాత్రం నడవనివ్వాలని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పినట్లు ఉండవల్లి అన్నారు.