River Ganga: గంగానది కోసం ప్రాణాలర్పించిన అగర్వాల్.. గంగమ్మ తన అసలైన కుమారుడిని కోల్పోయిందన్న రాహుల్ గాంధీ

  • గంగానది ప్రక్షాళన కోసం 109 రోజులుగా దీక్ష
  • కేవలం తేనె కలిపిన నీటిని మాత్రమే తీసుకున్న అగర్వాల్
  • ఎయిమ్స్‌లో గుండెపోటుతో మృతి

పవిత్ర గంగానదిని కాలుష్య రహితంగా మార్చాలన్న లక్ష్యంతో వంద రోజులకుపైగా నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ పర్యావరణవేత్త జీడీ అగర్వాల్ (87) ప్రాణాలు విడిచారు. ఉత్తరాఖండ్‌లోని ఎయిమ్స్‌లో ఆయన నిన్న గుండెపోటులో మృతి చెందారు. జూన్ 22న మొదలైన ఆయన నిరశన 109 రోజులపాటు కొనసాగింది. ఇన్ని రోజులపాటు కేవలం తేనె కలిపిన నీటినే తీసుకున్న అగర్వాల్ మంగళవారం నుంచి దానిని కూడా తీసుకోవడం మానేశారు. దీంతో బుధవారం పోలీసులు ఆయనను బలవంతంగా ఎయిమ్స్‌కు తరలించారు.

ఐఐటీ కాన్పూర్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసిన అగర్వాల్ అనంతరం గంగానది కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. గంగానదిని కాలుష్య రహితంగా మార్చాలని కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచారు. వాటి సాధన కోసం పలుమార్లు నిరాహార దీక్షలు చేపట్టారు.

దీంతో దిగివచ్చిన ప్రభుత్వం అగర్వాల్ డిమాండ్లలో చాలా వరకు నెరవేర్చామని, ఆయన తన దీక్షను విరమించాలని బుధవారం విజ్ఞప్తి చేసింది. గంగానది పరిరక్షణ చట్టం ముసాయిదాను కేబినెట్ పరిశీలనకు పంపినట్టు మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అయితే, అంతలోనే ఆయన మృతి చెందడంపై పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మాట్లాడుతూ గంగామాత తన అసలైన కుమారుడిని కోల్పోయిందని పేర్కొన్నారు. అగర్వాల్ పోరాటాన్ని తాము ముందుకు తీసుకెళ్తామని జైరాం రమేశ్ పేర్కొన్నారు.

River Ganga
GD Agarwal
AIIMS
Uttarakhand
Rahul Gandhi
  • Loading...

More Telugu News