YSRCP: వంగవీటి రాధా మాతోనే ఉన్నారు.. బీజేపీతో కలిసుంటే వైఎస్ భారతిపై కేసులు ఎలా పడతాయ్?: వైవీ సుబ్బారెడ్డి

  • ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ అన్యాయం చేసింది
  • వైసీపీ నేతలు మాత్రమే చిత్తశుద్ధితో పోరాడారు
  • 14 నెలల ముందే పదవులకు రాజీనామా చేశాం

ప్రత్యేక హోదా సాధన విషయంలో టీడీపీ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిందని వైసీపీ సీనియర్ నేత, పార్లమెంటు మాజీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. హోదా కోసం వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాలపై మాట్లాడే నైతిక అర్హత టీడీపీ నేతలకు లేదని విమర్శించారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ నేతలు, కార్యకర్తలు మాత్రమే ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడారని వ్యాఖ్యానించారు. ఈరోజు విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తమ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇస్తే చర్చే పెట్టలేదనీ, టీడీపీ ఇస్తే మాత్రం చర్చకు తీసుకువచ్చారని సుబ్బారెడ్డి గుర్తు చేశారు. బీజేపీ-టీడీపీ మధ్య కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. 23 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే ఎన్నికలు వచ్చేవి కాదా? అని ప్రశ్నించారు.

పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుకపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశామనీ, ఆమెపై చర్య తీసుకున్నా ఎన్నికలు వచ్చేవన్నారు. చంద్రబాబు ఎప్పుడూ తమకు మిత్రుడేనని పార్లమెంట్‌ సాక్షిగా హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగే చెప్పారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నా చేస్తే తమను అరెస్ట్‌ చేయించారని తెలిపారు. ఎన్నికల కమీషన్ గైడ్ లైన్స్ ప్రకారం 14 నెలలు ముందుగానే రాజీనామా చేశామని స్పష్టం చేశారు.

2018, ఏప్రిల్ 6న ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం రాజీనామాలు చేశామన్నారు. టీడీపీ, బీజేపీ భాగస్వాములుగా ఉండి హోదా విభజన హామీల విషయంలో మోసం చేశాయని, ఇది ప్రజలకు చెప్పేందుకే రాజీనామాలు చేశామని తెలిపారు. హోదా కోసం గుంటూరులో 8 రోజులు వైఎస్ జగన్ ఆమరణదీక్ష చేస్తే.. భగ్నం చేయించింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలందరూ రాజీనామా చేసి ఆమరణ దీక్ష చేశారని, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజలే టీడీపీ ప్రభుత్వానికి బుద్ది చెబుతారని పేర్కొన్నారు. వంగవీటి రాధా తమ పార్టీలోనే ఉన్నారని స్పష్టం చేశారు. తాము బీజేపీతో కలిసి ఉంటే తమపై, వైఎస్‌ భారతిపై ఎందుకు కేసులు పెడతారని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News