Sahyadri: కోతిని తరుముతూ పర్వతాల్లోకి వెళ్లి... ఎవరికీ తెలియని గుహను కనుక్కున్న యువకుడు!

  • వేల ఏళ్ల క్రితం సహజంగా ఏర్పడిన గుహ
  • సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో తొలిసారి వెలుగులోకి
  • గుహలో ఆదిమానవుల వస్తువులు, అవశేషాలు
  • రంగంలోకి దిగిన పురావస్తు శాస్త్రవేత్తలు

ఇదో అనుకోని ఆవిష్కృతం. వేల ఏళ్ల క్రితం సహజంగా ఏర్పడిన గుహ అది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఓ మారుమూల ఉంది. ఆదిమానవుల కాలంలో ఎండలు, వానల నుంచి రక్షణ కల్పించింది. ఆపై నాగరిక సమాజం ఎన్నడూ ఈ గుహ వంక చూడనేలేదు. అది ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ వారంలో ఈ గుహకు సంబంధించిన మరిన్ని వివరాలను కనుగొనేందుకు పురాతత్వ శాస్త్రవేత్తలు స్వయంగా రంగంలోకి దిగనున్నారు.

బుధవారం నాడు ఓ యువకుడు, కోతిని వెంబడించి పర్వతాల్లోకి పరుగు లంఘించగా, ఈ గుహను చేరాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, మహారాష్ట్రలోని లోనావాలా సమీపంలోని టికోనా కోట సమీపంలో పండ్ల రసాలను అమ్ముకుని జీవించే 22 ఏళ్ల యువకుడు గురుదాస్ మోహల్ వద్ద ఉన్న ఆహార పాత్రలను తన చేత దొరకబుచ్చుకున్న ఓ మర్కటం, అడవుల్లోకి పారిపోయింది. దీంతో ఆగ్రహంతో దాన్ని వెంబడిస్తూ పరిగెత్తాడు గురుదాస్. కొంతదూరం తరువాత, ఆ కోతి 15 మీటర్ల పొడవున్న ఓ గుహలోకి పారిపోయింది. ఎన్నడూ వెలుగులోకి రాని ఓ అద్భుత గుహ అతనికి కనిపించింది. దీనికి రెండు దారులు ఉన్నాయట.

అక్కడి నుంచి వచ్చిన తరువాత విషయాన్ని తన స్నేహితులకు చెబితే, కొంతమంది కలసి వెళ్లి గుహను చూసి వచ్చారు. ఆ వెంటనే కోట అధికారులకు విషయం తెలిసి వారు వెళ్లగా, ఆదిమానవులు వాడిన ఎన్నో మట్టి పాత్రలు, ఎముకలు కనిపించాయి. దీంతో విషయం పురావస్తు శాఖ అధికారులకు చేరింది.

వాస్తవానికి అక్టోబర్ నెలలో టూరిస్టులు, ట్రెక్కర్లు ఈ ప్రాంతానికి అధికంగా వస్తుంటారని, తన వ్యాపారాన్ని పాడుచేసిందన్న ఆగ్రహంతోనే తాను కోతిని వెంబడించానని అంటున్నాడు గురుదాస్. ఇంతకాలమూ ఈ గుహ చెట్ల ఆకులతో కప్పబడివుందని, ఇదే ప్రాంతంలో తిరుగుతున్న తమకు ఎన్నడూ కనిపించలేదని చెప్పాడు.

  • Loading...

More Telugu News