mee to: ‘మీ టూ’ ఎఫెక్ట్.. గుల్షన్ కుమార్ బయోపిక్ నుంచి తప్పుకున్న ఆమిర్ ఖాన్!
- బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సుభాష్ కపూర్
- కపూర్ తనను 2014లో వేధించాడని నటి గీతిక ఆరోపణ
- కేసు ఉన్నట్లు తేలడంతో వెనక్కి తగ్గిన ఆమిర్
భారతీయ సినీ, రాజకీయ రంగంలో మీ టూ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తనుశ్రీ దత్తా-నానా పటేకర్ వివాదం నుంచి చిన్మయి శ్రీపాద, సోనా మహాపాత్ర సహా పలువురు నటీమణులు, గాయనీమణులు ముందుకొచ్చి లైంగిక వేధింపుల పర్వాన్ని బయట పెడుతున్నారు. తాజాగా మీ టూ ఉద్యమం నేపథ్యంలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రఖ్యాత బాలీవుడ్ నిర్మాత గుల్షన్ కుమార్ జీవితం ఆధారంగా తీయాలనుకున్న బయోపిక్ నుంచి ఆమిర్, ఆయన భార్య కిరణ్ రావు తప్పుకున్నారు. గుల్షన్ కుమార్ బయోపిక్ ను ఆమిర్ ఖాన్ కు చెందిన ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా, సుభాష్ కపూర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే కపూర్ 2014లో తనను లైంగికంగా వేధించినట్లు నటి గీతిక త్యాగి తాజాగా బయటపెట్టారు. ఈ నేపథ్యంలో ఆమిర్ దంపతులు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు.
తొలుత ఈ విషయం బయటకు రాగానే తాము విచారణ జరిపామనీ, అందులో ఈ ఘటనకు సంబంధించి కేసు కోర్టులో ఉన్నట్లు తేలిందని ఆమిర్ ట్విట్టర్ లో తెలిపారు. ఈ విషయంలో తప్పెవరిదో తమకు తెలియదనీ, ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని తాము నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు.
మహిళలకు సురక్షిత, సంతోషకరమైన పని వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని ఆమిర్ అభిప్రాయపడ్డారు. మీ టూ ఉద్యమం కారణంగా సినీ పరిశ్రమ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా మేల్కొని లైంగిక వేధింపులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చాడు. సినీ రంగాన్ని మహిళలకు సురక్షితంగా, సంతోషకరమైన పని ప్రదేశంగా మార్చేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.