big boss: నా ఆర్మీని తేలికగా తీసుకోవద్దు...దూషిస్తే మట్టి కరిపిస్తా : బిగ్ బాస్-2 విజేత కౌశల్
- అభిమాన వర్షంలో తడవడం వల్లే విజేతనయ్యాను
- డబ్బులిచ్చి ఓట్లేయించుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది
- బహుమతి డబ్బుతోపాటు క్యాన్సర్ రోగులకు మరికొంత ఇస్తా
‘బిగ్ బాస్-2' విజేత కౌశల్ మండ తన ఆర్మీ విషయంలో ఇతరులకు వార్నింగ్ ఇస్తున్నాడు. 'కౌశల్ ఆర్మీని తేలికగా తీసుకోవద్దు, వారిని దూషిస్తే మట్టి కరిపిస్తాను. విజేతనయ్యేందుకు నేను డబ్బులు వెదజల్లానన్న ఆరోపణలు దురదృష్టకరం. అంత డబ్బున్న వాడినీ కాదు... ఆ అవసరమూ నాకు లేదు’ అన్నాడు. అభిమాన వర్షంలో తడిసి ముద్దవ్వడం వల్లే విజేతగా నిలిచానని మరోసారి స్పష్టం చేశాడు. విశాఖ నగరం భేల్ మైదానంలో బుధవారం రాత్రి అభిమానులు నిర్వహించిన కార్యక్రమంలో కౌశల్ పాల్గొని ప్రసంగించాడు.
తాను బీహెచ్‌పీవీ ప్రాంతంలోనే పుట్టి పెరిగానని, తన విద్యాభ్యాసం అంతా ఇక్కడే సాగిందని తెలిపాడు. బీహెచ్‌పీవీ ఉద్యోగిగా, ఓ కళాకారుడిగా తన తండ్రి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేసుకున్నాడు. నటన, ఫ్యాషన్‌పై ఉన్న మక్కువ వల్లే తాను హైదరాబాద్ వెళ్లిపోయినట్లు వివరించాడు.
అనంతరం కౌశల్ నగరంలోని హిడెన్ స్ప్రౌట్స్ సందర్శించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌశల్ ఆర్మీని విస్తరిస్తానని, విజయవాడ, బెంగళూరుతోపాటు అన్ని ప్రాంతాల్లోని అభిమానులను వ్యక్తిగతంగా కలుస్తానని తెలిపాడు. బిగ్ బాస్ ప్రైజ్ మనీ 50 లక్షల రూపాయలు క్యాన్సర్ రోగుల సహాయార్థం అందించిన కౌశల్ తన సొంత నిధుల నుంచి మరికొంత రోగుల కోసం ఖర్చు చేస్తానని స్పష్టం చేశాడు.