dussehra: భక్తుల భద్రత కోసం.. దుర్గమ్మ ఆలయం వద్ద గజ ఈతగాళ్ల మోహరింపు!
- దసరా వేళ పెరిగిన భక్తుల తాకిడి
- పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు
- అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు
దసరా వేడుకల సందర్భంగా విజయవాడలోని కనక దుర్గమ్మ ఆలయానికి భక్తుల తాకిడి పెరుగుతోంది. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకుంటున్న భక్తులు కృష్ణా నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఘాట్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మత్స్యశాఖ అధికారులు గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు.
దుర్గాఘాట్ వద్ద ఒక్కో షిఫ్టులో 20 మంది చొప్పున మూడు షిఫ్టుల్లో గజ ఈతగాళ్లను మోహరించారు. వీరంతా బారికేడ్ల వద్ద పడవల్లో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. బారికేడ్లు దాటి ఎవ్వరూ రాకుండా పడవలను అడ్డుపెట్టారు. భక్తులను అప్రమత్తం చేస్తూ లోతుకు వెళ్లవద్దని సూచనలు చేస్తున్నారు. దుర్గమ్మ ఆలయంలో ఈ నెల 10 ప్రారంభమైన నవరాత్రి వేడుకలు 18 వరకూ అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
ఆశ్వయుజ పాడ్యమి నుంచి దశమి వరకు అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొలి మూడు రోజులు పార్వతిగా, తర్వాత మూడు రోజులు లక్ష్మీగా, చివరి మూడు రోజులు సరస్వతి రూపంలో జగన్మాత భక్తులను అనుగ్రహించనుంది. విజయ దశమి రోజు శ్రీరాజరాజేశ్వరీ దేవిగా అలంకారభూషితమై దుర్గాదేవి భక్తులకు దర్శనమివ్వనుంది.