Jaipur: దోపిడీల కోసం.. నెలవారీ వేతనాలతో ఆరుగురిని ఉద్యోగంలో చేర్చుకున్న యువకుడు!
- ఇవో రకం ఉద్యోగాలు
- రోజుకు కనీసం ఒక్క నేరమైనా చేయాల్సిందే
- నెల వేతనం రూ.15 వేలు
నిరుద్యోగ యువతకు ఓ యువకుడు మరోలా ఉద్యోగాలిచ్చి ఆదుకుంటున్నాడు. బంగారు నగలు, మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలు దొంగిలించేందుకు ఆరుగురు వ్యక్తులను నెలవారీ వేతనాలతో ఉద్యోగంలో చేర్చుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. జైపూర్‌లో జరిగిందీ ఘటన. ఉద్యోగంలో చేరిన వ్యక్తి రోజుకు కనీసం ఒక్క నేరమైనా చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం నెలకు రూ.15 వేల వేతనం చెల్లిస్తున్నాడు. ఒకవేళ నేరం చేయడంలో విఫలమైతే ఆ రోజు వేతనం కట్ అయిపోతుంది.
సదరు గ్యాంగ్ లీడర్ సహా మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు జైపూర్ ఈస్ట్ డీసీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. జవహర్ సర్కిల్ ఏరియా, శివ్‌దాస్‌పుర, ఖో నగోరియాన్, సంగనీర్ సహా ఇతర ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లు, మొబైల్ ఫోన్ దొంగతనాలు, మోటార్ సైకిళ్ల మాయంపై తరచూ ఫిర్యాదులు వస్తుండడంతో నిఘా వేసిన పోలీసులు పకడ్బందీ ప్రణాళికతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుంచి మొత్తం 35 పోన్లు, ల్యాప్‌టాప్, రెండు చైన్లు, మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యులు దొంగిలించిన వస్తువులను నాయకుడు ఆశిష్ మీనాకు ఇస్తారని, అతడు వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటాడని డీసీపీ తెలిపారు. ముఠా సభ్యులందరూ నిరక్షరాస్యులని, ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటున్న వారేనని వివరించారు. వీరిందరినీ ఉద్యోగంలోకి తీసుకున్న ఆశిష్ వారందరినీ ఓ ఇంట్లో పెట్టినట్టు తెలిపారు. జూలైలో వీరిని రిక్రూట్ చేసుకున్నాడని, ఇప్పటి వరకు 36 నేరాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.