jarkhand: చదువుకోవాలని చెప్పినా వినని కొడుకు.. ఆగ్రహంతో తుపాకీతో కాల్చిచంపిన తండ్రి!
- జార్ఖండ్ రాజధాని రాంచీలో ఘటన
- ఉదయాన్నే లేచి చదువుకోవాలని తండ్రి సూచన
- మాట వినకుండా ఎదురుతిరిగిన కొడుకు
ఆయనో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. తనలాగే తన కుమారుడు కూడా క్రమశిక్షణతో ఉండాలని కోరుకున్నాడు. అయితే యువకుడు మాత్రం ఆయన మాట వినకుండా ఎక్కువ సేపు నిద్రపోవడం, ఎదురుతిరగడం వంటివి చేస్తుండేవాడు. దీంతో ఓపిక నశించిన సదరు తండ్రి తుపాకీతో కన్న కొడుకునే కాల్చిచంపాడు. ఈ ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలో చోటుచేసుకుంది.
రాంచీలోని టికలీటోలీ ప్రాంతంలో రిటైర్డ్ సీఆర్పీఎఫ్ జవాన్ రాకేశ్ రావత్ తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఆయన కుమారుడు రాహుల్ ప్రస్తుతం పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నాడు. ఉదయాన్నే లేచి బాగా చదువుకోవాలని ఎన్నిసార్లు తండ్రి చెప్పినా రాహుల్ పెడచెవిన పెట్టేవాడు. అంతేకాకుండా ఎదురు తిరిగి మాట్లాడేవాడు.
కుమారుడి వైఖరితో మనస్తాపం చెందిన రాకేశ్ సహనం కోల్పోయి తన లైసెన్సెడ్ తుపాకీతో కన్నకొడుపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రాహుల్ ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.