Rafele: తూచ్.. రాఫెల్ డీల్ విషయంలో మాట మార్చిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్
- భారత వాయుసేన ప్రతిష్ఠను దిగజార్చేలా గతంలో వ్యాఖ్యలు
- మాట మార్చిన రక్షణ మంత్రి
- మిగతా విమానాలను దేశంలోనే తయారు చేస్తామని స్పష్టీకరణ
రాఫెల్ యుద్ధ విమానాల డీల్ విషయంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ మాట మార్చారు. గతంలో ఈ డీల్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తడంతో తూచ్ చెప్పారు. యూపీఏ ప్రభుత్వం 126 యుద్ధ విమానాల కొనుగోలుకు చర్చలు జరిపిందని, అయితే, అన్ని విమానాలను సమకూర్చుకునేందుకు తగిన మౌలిక సదుపాయాలు భారత్ వద్ద లేవని, భారత వాయుసేనకు అంత సామర్థ్యం లేదని, కాబట్టే 36 విమానాలతో సరిపెడుతున్నామని గతంలో ఓ ఇంటర్వ్యూలో మంత్రి పేర్కొన్నారు.
ఆమె వ్యాఖ్యలు భారత వాయుసేన ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నాయని, వాయుసేన సత్తాను తగ్గించేలా ఆమె మాట్లాడారంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆమె తాజాగా మాటమార్చారు. ఫ్రాన్స్ నుంచి 36 విమానాలను మాత్రమే కొనగోలు చేస్తున్నప్పటికీ మిగతా వాటిని మేకిన్ ఇండియాలో భాగంగా తయారుచేస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం పలు కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు. రక్షణ అవసరాలను తగ్గించుకుంటున్నామనే విపక్షాల విమర్శల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. అయితే, యుద్ధ విమానాల ధరల్లో చోటుచేసుకుంటున్న మార్పులపై మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు. అప్పటి రక్షణ మంత్రి, విదేశాంగ కార్యదర్శికి కూడా తెలియకుండా ప్రధానే ఈ నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణలను మంత్రి ఖండించారు.