Dk Aruna: పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినపుడు కేసీఆర్ ఎక్కడున్నారు?: డీకే అరుణ ధ్వజం
- సోనియా గాంధీ రుణం తీర్చుకోవాల్సిన తరుణమిదన్న అరుణ
- తెలంగాణ తెచ్చింది నలుగురు దొంగల కోసమా- విజయశాంతి
- ప్రజా ప్రభుత్వమా.. దొరల పాలనా? తేల్చుకోవాలి- భట్టి
పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టినపుడు కేసీఆర్ ఎక్కడున్నారని మాజీ మంత్రి డీకే అరుణ ధ్వజమెత్తారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న అరుణ మాట్లాడుతూ.. యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదన్నారు. సోనియాగాంధీ రుణం తీర్చుకోవాల్సిన తరుణం వచ్చిందని, కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని ప్రజల్ని అరుణ కోరారు.
ప్రజల ప్రభుత్వం కావాలో, దొరల పాలన కావాలో ప్రజలే తేల్చుకోవాలని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ భట్టి విక్రమార్క అన్నారు. ఏటా లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన కేసీఆర్ ప్రభుత్వం.. లెక్కలు చెప్పమంటే ఎదురుదాడికి దిగుతోందని భట్టి ఆరోపించారు. కాంగ్రెస్ నేతృత్వంలో తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తామని అన్నారు.
అనంతరం కాంగ్రెస్ ప్రచార కర్త విజయశాంతి మాట్లాడుతూ.. తెలంగాణ తెచ్చింది నలుగురు దొంగల కోసమా? బడుగు బలహీన వర్గాల కోసమా? అని ప్రశ్నించారు. తెలంగాణలో 20 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని.. దానికి ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయని విజయశాంతి ఆరోపించారు.