kalish kher: గాయకుడు కైలాశ్ ఖేర్ నీచుడు.. నన్ను గదిలోకి రమ్మన్నాడు!: గాయని సోనా మహాపాత్ర ఆరోపణ
- ‘మీ టూ’ ఉద్యమంలో బయటపెట్టిన గాయని
- చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణ
- తననూ వేధించాడన్న జర్నలిస్ట్ సంధ్య
సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై ప్రకంపనలు సృష్టిస్తున్న ‘మీ టూ’ ఉద్యమంలో భాగంగా చాలామంది గాయకులు, నటులు బయటకువస్తున్నారు. తాజాగా బాలీవుడ్ గాయని సోనా మహపాత్ర సంచలన ఆరోపణలు చేసింది. ప్రముఖ గాయకుడు కైలాశ్ ఖేర్ తనపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. తాను ఓరోజు కాఫీ షాప్ లో కైలాశ్ ఖేర్ తో సమావేశమయ్యానని తెలిపింది. తామిద్దరం కలిసి ఓ కచేరీని నిర్వహించాల్సి ఉండటంతో కలుసుకున్నానని వెల్లడించింది.
ఆ సమయంలో తనపై చేతులు వేసిన కైలాశ్ ఖేర్.. ‘నువ్వు చాలా అందంగా ఉన్నావ్’ అంటూ వేధించాడని వాపోయింది. దీంతో తానక్కడ ఉండలేక లేచి వెళ్లిపోయానని తెలిపింది. అక్కడితో తనను కైలాశ్ వదలలేదనీ, కచేరీ సందర్భంగా తన గదికి రావాలంటూ ఒత్తిడి చేశాడని సోనా వెల్లడించింది. అందువల్లే అతని నుంచి ఫోన్లు వచ్చినా లిఫ్ట్ చేయడం మానేశాననీ, చివరికి నిర్వాహకులకు ఫోన్ చేసి వారి సాయంతో తనతో మాట్లాడాడని పేర్కొంది. గతంలో కైలాశ్ తన స్టూడియోలో ఎన్నో పాటలు పాడాడనీ, అతనికి ఇలాంటి బుద్ధి ఉందని తెలిస్తే అసలు దగ్గరకు రానిచ్చేదానినే కాదని వ్యాఖ్యానించింది. ఇలాంటి నీచుడు తాను చాలా సింపుల్ వ్యక్తినని ట్విట్టర్ లో రాసుకున్నాడంటూ మండిపడింది.
కేవలం సోనా మహాపాత్రకే కాకుండా విలేకరి సంధ్యా మీనన్ ను కూడా కైలాశ్ ఖేర్ వేధించినట్లు తేలింది. కైలాశ్ ఖేర్ ఆమెకు పంపిన సందేశాల స్క్రీన్ షాట్లను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో సదరు విలేకరికి ఖేర్ క్షమాపణ చెప్పారు. దీనిపై సంధ్యా మీనన్ తీవ్రంగా స్పందిస్తూ..‘ఎంతమంది ఆడవాళ్లకు క్షమాపణలు చెబుతారు కైలాశ్? ఇప్పటినుంచే మొదలుపెట్టండి. మీరు అందరికీ క్షమాపణలు చెప్పేసరికి జీవితకాలం పడుతుంది’ అంటూ వ్యంగ్యంగా పేర్కొంది.