apsrtc: దసరా ఉత్సవాల దృష్ట్యా ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు: ఎండీ సురేంద్రబాబు
- ఈ నెల 12 నుంచి 22 వరకు 3,300 ప్రత్యేక బస్సులు
- త్వరలో కొత్త బస్సులు కొనుగోలు చేస్తాం
- ఆర్టీసీకి అప్పులు లేకుండా చేయాలన్నదే ఆలోచన
దసరా ఉత్సవాల దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని ఎండీ సురేంద్రబాబు తెలిపారు. ఈ నెల 12 నుంచి 22 వరకు 3,300 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు చెప్పారు. కొత్తగా కొనుగోలు చేయనున్న బస్సుల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. 805 బస్సులు కొనుగోలు చేస్తున్నామని, మార్చి నెలాఖరులోపు కొత్త బస్సులు అందుబాటులోకి వస్తాయని అన్నారు.
ఆర్టీసీ సిబ్బందిపై పనిభారం ఉందన్న విషయం వాస్తవమేనని, దీనిని చార్ట్ డ్యూటీలను క్రమబద్ధీకరించడం ద్వారా అధిగమిస్తామని అన్నారు. కార్మికులు, అధికారుల సహకారంతో ఆరు నెలల్లో రూ.160 కోట్ల ఆదాయం సాధించామని, ఆర్టీసీకి అప్పులు లేకుండా చేయాలనేది తమ ఆలోచనని చెప్పారు. ఆర్టీసీకి సొంత స్థలాలు ఉన్న 18 చోట్ల త్వరలోనే స్వయంగా పెట్రోల్ బంకులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.