ex.MP sabbam Hari: ఆస్తుల స్వాధీనానికి మాజీ ఎంపీ సబ్బం హరికి సహకార బ్యాంకు నోటీసులు
- బకాయిలు తీర్చని కారణం
- వడ్డీతో సహా మొత్తం అప్పు రూ. 9.54 కోట్లు
- 60 రోజుల్లో చెల్లించకుంటే చర్యలు చేపడతామని పేర్కొన్న బ్యాంకు
‘వడ్డీతో సహా మీరు చెల్లించాల్సిన రుణ మొత్తం 9.54 కోట్ల రూపాయలు. ఈ మొత్తాన్ని 60 రోజుల్లోగా చెల్లించాలి. లేదంటే అప్పుకోసం మీరు కుదువ పెట్టిన ఇల్లు, అపార్ట్ మెంట్, స్థలం స్వాధీనం చేసుకుంటాం’...విశాఖ మాజీ మేయరు, అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బంహరికి విశాఖ సహకార బ్యాంకు అందించిన నోటీసు వివరాలివి. వాయిదాలు చెల్లించక పోవడంతో ఎన్‌పీఏ జాబితాలో చేర్చిన బ్యాంకు ఆర్‌బీఐ నిబంధనల మేరకు ఆస్తుల స్వాధీనానికి మంగళవారం ఈ నోటీసులు అందజేసింది.
వివరాల్లోకి వెళితే...నగరం నడిబొడ్డున మద్దిలపాలెంలో ఉన్న డక్కన్ క్రానికల్ భవనాన్ని 2014లో కోటక్ మహేంద్ర వేలం వేసింది. ఈ భవనాన్ని 17 కోట్ల 80 లక్షల రూపాయలకు సబ్బం హరి పాడుకున్నారు. ఇందుకోసం సీతమ్మధారలో 1622 చదరపు గజాల స్థలంలో ఉన్న తన నివాసగృహాన్ని, మాధవధార వుడా లే అవుట్‌లోని 444.44 చదరపు అడుగుల స్థలంలో ఉన్న అపార్ట్‌మెంట్, విశాఖ బీచ్ రోడ్డులో రుషికొండ సమీపంలో ఉన్న 800 చదరపు గజాల స్థలాన్ని కుదువపెట్టి 8.5 కోట్ల రూపాయల రుణాన్ని సహకార బ్యాంకులో తీసుకున్నారు.
అయితే మద్దిలపాలెంలోని తమ భవనం వేలం నిబంధనల మేరకు నిర్వహించలేదంటూ డక్కన్ క్రానికల్ యాజమాన్యం డెబిట్ రికవరీ అథారిటీలో కేసు పెట్టడంతో ఈ వివాదం కోర్టుకు చేరింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. ఈ తీర్పు రాకపోవడంతో సబ్బం హరికి భవనం స్వాధీనం కాలేదు. మరోవైపు తీసుకున్న రుణం వడ్డీతో సహా 9.54 కోట్లకు చేరింది. బకాయిు చెల్లించక పోవడంతో కుదువ పెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటానని తన నోటీసుల్లో బ్యాంకు పేర్కొంది.