nanapatekar: నానా పటేకర్ లైంగికంగా వేధించాడంటే నేను నమ్మను.. తనుశ్రీ పొరబడి ఉండొచ్చు!: రామ్ గోపాల్ వర్మ
- సినీ పరిశ్రమలో వేధింపులు కొత్తకాదు
- తనుశ్రీని నేను విమర్శించడం లేదు
- ట్వీట్టర్ లో స్పందించిన రామ్ గోపాల్ వర్మ
సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు అన్నవి వాస్తవమేనని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపారు. తనుశ్రీ దత్తా సహా పలువురు నటీమణులు ముందుకొచ్చి క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై మాట్లాడటం అభినందనీయమని పేర్కొన్నారు. తనుశ్రీ దత్తా-నానాపటేకర్ వ్యవహారంలో వాస్తవంగా ఏం జరిగిందో తనకు తెలియదని వ్యాఖ్యానించారు.
నానా పటేకర్ తో తాను చాలాకాలం కలిసి పనిచేశాననీ, ఆయన షార్ట్ టెంపర్ వ్యక్తి అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. కానీ నానాపటేకర్ వ్యక్తిగతంగా ఒకరిని వేధించే వ్యక్తి కాదన్నారు. ముంబైకి వెళ్లిన తొలి రోజుల్లో తాను నానాపటేకర్ కు ఫోన్ చేశానని వెల్లడించారు ‘‘ఆరోజు నానా పటేకర్ కు ఫోన్ చేశా. సాధారణంగా ఎవరైనా ఫోన్ చేస్తే మనం వెంటనే హలో అంటాం. కానీ ఆయన మాత్రం చెప్పు (బోల్) అంటూ మొదలుపెట్టాడు. 'సార్ నా పేరు రామ్ గోపాల్ వర్మ. సినిమా డైరెక్టర్ ను. హైదరాబాద్ నుంచి మిమ్మల్ని కలవడానికి వచ్చాను' అని చెప్పాను. 'వెంటనే ఇంటికి వచ్చేయ్' అని నానా పటేకర్ సమాధానమిచ్చారు’’ అని వర్మ పేర్కొన్నారు.
నానా పటేకర్ అంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ వ్యక్తి అని వర్మ కితాబిచ్చారు. తాను కథ చెబుతుండగా ‘టీ తాగుతావా?’ అని ఆయన అడిగారని, తాను తాగుతానని చెప్పగానే కిచెన్ చూపించి ‘నాక్కూడా ఒకటి పట్టుకురా’ అని పురమాయించారని వర్మ గుర్తుచేసుకున్నారు. తనకు టీ చేయడం రాదని చెప్పగానే, ‘ఇంత వయసు వచ్చింది.. ఇంకా టీ చేయడం రాకపోవడం ఏంటి? మీ అమ్మకు ఫోన్ కలుపు’ అంటూ గద్దించారన్నారు.
ఆ తర్వాత తన తల్లితోనూ ఫోన్ లో మాట్లాడారని వర్మ తెలిపారు. నానాపటేకర్ ను అర్థం చేసుకుంటే ఆయన్ను అందరూ గౌరవిస్తారని చెప్పారు. తనకు తెలిసి నానాపటేకర్ జీవితంలో ఎన్నడూ లైంగిక వేధింపులకు పాల్పడడని వర్మ స్పష్టం చేశారు. నానా పటేకర్ గురించి పూర్తిగా తెలియని వ్యక్తులు ఆయన ప్రవర్తనను పొరపాటుగా అర్థం చేసుకుని ఉండొచ్చని వ్యాఖ్యానించారు. నానా పటేకర్ అసలు అలాంటి వ్యక్తే కాదని వర్మ చివరిగా తేల్చేశారు.