Telangana: ఉత్తమ్ వల్ల రెండు విమానాలు కూలిపోయాయి.. రూ.1,200 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడు!: మాజీ ఐఏఎఫ్ ఉద్యోగి ప్రభాకర్ రావు ఆరోపణ
- ఉత్తమ్ కారణంగా ఐఏఎఫ్ కు రూ.500 కోట్ల నష్టం
- ప్యారచూట్ వాడటం చేతకాక వెన్నెముకకు దెబ్బతగిలింది
- అధికారుల్ని మేనేజ్ చేసి రాష్ట్రపతి భవన్ లో చేరాడు
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మాజీ సైనికుడు బోయినపల్లి ప్రభాకర్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కారణంగానే భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన రెండు యుద్ధ విమానాలు కూలిపోయాయని తెలిపారు. దీని కారణంగా ప్రభుత్వానికి రూ.500 కోట్ల నష్టం జరిగిందన్నారు. విమానాలనే సక్రమంగా నడపలేని ఉత్తమ్ ఇక కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళతారని ఎద్దేవా చేశారు.
విమానాలు కూలిపోయిన ఘటనలో ఉత్తమ్ 3 నెలల పాటు విచారణను ఎదుర్కొన్నాడని ప్రభాకర్ రావు తెలిపారు. ఆయన కెరీర్ అంతా గందరగోళంగా సాగిందన్నారు. ప్యారచూట్ సాయంతో సరిగా జంప్ చేయలేకపోవడంతో ఉత్తమ్ వెన్నెముకకు దెబ్బ తగిలిందని వెల్లడించారు. చివరకు అధికారులను మేనేజ్ చేసుకుని రాష్ట్రపతి భవన్ లో ఏడీసీ అధికారిగా చేరాడన్నారు. ఇలా తొమ్మిదేళ్ల పాటు ఉత్తమ్ రాష్ట్రపతి భవన్ లో పనిచేశాడని పేర్కొన్నారు. 1979లో పంజాబ్ లోని ఆదంపూర్ లో తాను ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ గా ఉంటే.. ఉత్తమ్ ఫ్లైట్ లెఫ్టినెంట్ గా పనిచేసేవాడన్నారు.
ఐఏఎఫ్ లో పైలెట్ ను కెప్టెన్ అని పిలవరనీ, ఫ్లైట్ లెఫ్టినెంట్ గా మాత్రమే వ్యవహరిస్తారని వెల్లడించారు. కేవలం బ్రిటిష్ ఆర్మీలో మాత్రమే పైలెట్లను ఫ్లైట్ కెప్టెన్ అంటారన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కించపరిచేలా మాట్లాడితే మాజీ సైనికులు ఉత్తమ్ సంగతి చూసుకుంటారని హెచ్చరించారు. కరీంనగర్ మాజీ సైనికుల హౌసింగ్‌బోర్డు అధ్యక్షుడిగా తాను ఉన్నప్పుడు ఇండ్ల కోసం ఆయన చుట్టూ తిరిగామని.. రూ.1200 కోట్ల ఇళ్ల కుంభకోణంలో ఉత్తమ్ హస్తం ఉందని ఆరోపించారు.