flipkart: ఫ్లిప్ కార్ట్ లో ‘స్మార్ట్’ దొంగ.. ఖరీదైన ఫోన్లను కొట్టేస్తున్న డెలివరీ బాయ్ అరెస్ట్!
- రాజస్తాన్ లోని జైపూర్ లో ఘటన
- ఫోన్లను కొట్టేసి సబ్బులు పెడుతున్న ఉద్యోగి
- మేనేజర్ ఫిర్యాదుతో వెలుగులోకి
ఫ్లిప్ కార్ట్ లో ఓ ఉద్యోగి చేతివాటం చూపాడు. ఆన్ లైన్ లో కస్టమర్లు ఆర్డర్ ఇచ్చిన స్మార్ట్ ఫోన్లను కొట్టేసి వాటి స్థానంలో సబ్బులు పెట్టి పంపేవాడు. ఈ ఘటనపై కంపెనీ ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు. ఈ ఘటన రాజస్తాన్ లోని జైపూర్ లో చోటుచేసుకుంది.
జైపూర్ లోని విద్యాధర్ నగర్ లో ఉంటున్న కుమార్ మీనా(30) ఫ్లిప్ కార్ట్ లో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. కస్టమర్లు ఇచ్చే ఆర్డర్లలో ఖరీదైన స్మార్ట్ ఫోన్లనే కుమార్ టార్గెట్ గా చేసుకునేవాడు. ఫోన్లను నొక్కేసి వాటి స్థానంలో సబ్బులను ఉంచేవాడు. దీంతో కంపెనీకి వరుస ఫిర్యాదులు అందాయి.
ఈ నేపథ్యంలో కంపెనీ విద్యాధర్ నగర్ హబ్ ఇన్ చార్జీ సునీల్ కుమార్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో కుమార్ మీనా ఇంటిపై దాడిచేసిన పోలీసులు రెండు ఖరీదైన స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి ఖరీదు రూ.50 వేల వరకూ ఉండొచ్చని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేశామనీ, ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని తెలిపారు.