Metoo: నేను మాట్లాడాల్సిన సమయం వచ్చింది... బ్యాడ్మింటన్ కు దూరమైన కారణమిదే!: వేధింపులపై గుత్తా జ్వాల

  • కొనసాగుతున్న 'మీటూ' ప్రకంపనలు
  • క్రీడా రంగంలోనూ వేధింపులు
  • 2006లో చీఫ్ గా వచ్చిన వ్యక్తి వేధించాడన్న జ్వాల

దేశవ్యాప్తంగా 'మీటూ' ఉద్యమం ప్రకంపనలు పుట్టిస్తుండగా, లైంగిక వేధింపులను ఎదుర్కొన్నామని చెబుతున్న సెలబ్రిటీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేవలం సినీ పరిశ్రమకు మాత్రమే వేధింపులు పరిమితం కాలేదని, మీడియా, క్రీడా రంగాల్లోనూ ఈ జాడ్యం ఉందని చెబుతూ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తనకు ఎదురైన వేధింపులను పంచుకుంది. తనను ఓ వ్యక్తి మానసికంగా ఎంతో వేధించాడని చెప్పింది. ఈ మేరకు ట్విట్టర్ లో కొన్ని ట్వీట్లు పెట్టింది.

"నాకు ఎదురైన మానసిక వేధింపులను వెల్లడించే సమయం ఆసన్నమైందని అనుకుంటున్నాను. అతను 2006లో చీఫ్ గా వచ్చాడు. జాతీయ చాంపియన్ షిప్ సాధించిన నన్ను జట్టు నుంచి తొలగించాడు. మానసికంగా వేధింపులకు గురి చేశాడు. రియో ఒలింపిక్స్ తరువాత కూడా ఇవి సాగాయి. నేను బ్యాడ్మింటన్ ను వదిలేందుకు ఈ వేధింపులు కూడా కారణం. నేను మిక్సెడ్ డబుల్స్ లో ఎవరితో ఆడతానో తెలుసుకుని, అతన్ని బెదిరించేవాడు. అందుకే నేను జట్టుకు పూర్తిగా దూరమయ్యాను. అన్ని రకాలుగా నన్ను ఒంటరిని చేశాడు" అని పేర్కొంది.

కాగా, సింధు, సైనాల వంటి సింగిల్స్ క్రీడాకారులకు ప్రోత్సాహం ఇస్తూ, సంచలన విజయాలు సాధించిన తనను పక్కనబెడుతున్నారని ఆరోపిస్తూ, గతంలో గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన సంగతి విదితమే.

  • Loading...

More Telugu News