JNU: జేఎన్ యూ విద్యార్థి అదృశ్యం కేసులో కీలక మలుపు.. కేసు మూసివేతకు సీబీఐకి హైకోర్టు అనుమతి!
- కేసు మూసివేత నివేదిక సమర్ఫరణకు కోర్టు అనుమతి
- అహ్మద్ తల్లి పిటీషన్ ను కొట్టివేసిన న్యాయమూర్తుల బెంచ్
- నిందిత విద్యార్థులను ప్రశ్నించలేదంటున్న న్యాయవాది
రెండేళ్ల క్రితం అదృశ్యమైన జేఎన్ యూ విద్యార్థి నజీబ్ అహ్మద్ కేసు మూసివేతకు సంబంధించిన నివేదికను సమర్పించేందుకు దర్యాప్తు సంస్థ సీబీఐకి ఢిల్లీ హైకోర్ట్ సోమవారం అనుమతినిచ్చింది. కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐని తప్పించి, ప్రత్యేక విచారణ బృందం (సిట్)తో విచారణతోపాటు కేసును పర్యవేక్షించాలని నజీబ్ అహ్మద్ తల్లి ఫతిమా నఫీస్ దాఖలు చేసిన పిటీషన్ ను న్యాయమూర్తులు ఎస్ మురళిధర్, వినోద్ గోయల్ ల బెంచ్ తిరస్కరించింది. తన వద్ద ఉన్న ఆధారాలను ట్రయల్ కోర్టు ముందుంచాలని సూచిస్తూ, పిటీషన్ ను కొట్టివేసింది.
ఇదిలావుండగా తన కొడుకు ఆచూకీని కనిపెట్టేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ నాఫీస్ నవంబర్ 2016లో హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో గతేడాది మే 16న సీబీఐ విచారణను ప్రారంభించింది. ఏడాదిపాటు అన్ని కోణాల్లో సీబీఐ దర్యాప్తు జరిపింది. కానీ అహ్మద్ అదృశ్యం విషయంలో ఎలాంటి నేరం చోటుచేసుకోలేదనే అభిప్రాయానికి వచ్చింది.
ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే, ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్ యూ)లోని మహి-మండ్వీ హాస్టల్ నుంచి 2016 అక్టోబర్ 15న అహ్మద్ అదృశ్యమయ్యాడు. ఏబీవీపీ అనుబంధ విద్యార్థులతో అంతకుముందు రోజు రాత్రి ఘర్షణ జరగడంతో అహ్మద్ అదృశ్యంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేసును రాజకీయం చేశారని, రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు సీబీఐ తలొగ్గిందని నాఫీస్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. అహ్మద్ పై తొమ్మిది మంది విద్యార్థులు దాడి చేశారంటూ ప్రత్యక్షసాక్షులైన 18 మంది విద్యార్థులు చెబుతున్నారు. నిందితుల పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ వారిని ఇంతవరకూ పోలీసులు ప్రశ్నించలేదని నాఫీస్ తరపు న్యాయవాది తెలిపారు. ఇదిలావుండగా ఫిర్యాదులో పేర్కొంటున్న తొమ్మిది మంది విద్యార్థులు తాము ఎలాంటి నేరానికి పాల్పడలేదని చెబుతున్నారు.
తన కొడుకు ఆచూకీని కనిపెట్టేందుకు పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ నవంబర్ 25, 2016న నాఫీస్ హైకోర్టును ఆశ్రయించింది. ఏడు నెలల దర్యాప్తు తర్వాత అహ్మద్ అదృశ్యానికి సంబంధించి ఢిల్లీ పోలీసులు ఎలాంటి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. దీంతో గతేడాది మే 16న కేసును సీబీఐకి అప్పగించారు. అయితే, సీబీఐ కూడా అతని ఆచూకీ కనిపెట్టడంలో విఫలం కావడం గమనార్హం.