DK Aruna: ఏం బండారం బయట పెడతవో దమ్ముంటే పెట్టు: కేసీఆర్‌కు డీకే అరుణ సవాల్

  • సోనియమ్మ కాళ్లు మొక్కింది మరిచిపోయావా?
  • ఆయనను ఏమైనా అంటే సీఎంను అంటారా అంటుండు
  • తెలంగాణ తెచ్చుకుంది బాంఛన్‌ దొర అనేందుకా?
  • కేసీఆర్‌ దొరకు అధికారం కట్టబెట్టి బానిసల్లా బతుకుదామా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ మండిపడ్డారు. సోనియమ్మను కేటీఆర్‌.. అమ్మనా బొమ్మనా అంటాడా? తెలంగాణ ఇచ్చాక కుటుంబం అంతా పోయి కాళ్లు మొక్కింది మరిచిపోయావా? అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కుత్బుల్లాపూర్‌లో ఆమె పర్యటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్‌పై, ఆయన కుటుంబ పాలనపై విరుచుకుపడ్డారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి కేబినెట్‌లో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ తన కూతురు కవితకు తప్ప మహిళలెవ్వరికి గౌరవం ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. కేసీఆర్‌, కేటీఆర్‌, కవితల కోసమే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందా? అంటూ ప్రశ్నించారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకునే బాధ్యత మహిళలపై ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేశాం.. కానీ కేసీఆర్ పాలనలో మహిళలకు ఒక్కపథకం తెచ్చారా? కనీసం ఒక్క మీటింగ్ పెట్టారా? జీహెచ్ఎంసీలో రోడ్లు ప్రజల కోసం వేస్తున్నారా? కాంట్రాక్టర్ల కోసమా? విశ్వనగరంలో హైదరాబాద్ రోడ్లు తీర్చిదిద్దుతామని చెప్పిన మీరు ఇప్పుడు నోరెందుకు మెదుపుతలేరు. రోడ్లు ఇంత అధ్వానంగా ఉంటే బాగుచేయకుండా ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోయినవ్? ఉద్యమం సమయంలో ఆంధ్రవాళ్లు పోతే ఇళ్లన్నీ మనవే అన్నడు. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ల ఓట్ల కోసం.. కాలికి ముళ్లు గుచ్చుకుంటే పంటితో తీస్తా అని కేసీఆర్‌ చేసిన నీచ రాజకీయాలను ప్రజలందరూ గుర్తుంచుకోవాలి.

నేను గద్వాలలో ప్రశ్నించిన వాటికి కేసీఆర్‌ సమాధానం చెప్పక అరుణమ్మ ఒళ్లు దగ్గర పెట్టుకో అంటడు. నీ ఇంట్లో మహిళలను ఎవరైనా అలా అంటే ఊర్కుంటావా? బండారం బయట పెడతడట.. ఏం బండారం పెడతవో దమ్ముంటే బయటపెట్టు. ఆయనను ఏమైనా అంటే సీఎంను అంటారా అంటుండు. మరి సీఎం పదవిలో ఉన్న నువ్వు ఎట్ల పడితే అట్ల మాట్లాడుతావా? తెలంగాణ తెచ్చుకుంది బాంఛన్‌ దొర అనేందుకా? ప్రజలను ఒక్కటే అడుగుతున్నా, మళ్లీ కేసీఆర్‌ దొరకు అధికారం కట్టబెట్టి బానిసల్లా బతుకుదామా అనే విషయాన్ని మీరే నిర్ణయించుకోవాలి’’ అని అరుణ పేర్కొన్నారు.                                                                                                              

  • Loading...

More Telugu News