BJP: స్వచ్ఛ భారత్ కు తూట్లు.. బహిరంగంగా మూత్ర విసర్జన చేసిన బీజేపీ మంత్రి

  • బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేసిన రాజస్థాన్ మంత్రి
  • మండి పడుతున్న నెటిజెన్లు
  • నిర్మానుష్య ప్రాంతంలో మూత్ర విసర్జన చేశానంటూ మంత్రి వివరణ

బహిరంగ మల, మూత్ర విసర్జన చేయకుండా దేశాన్ని స్వచ్ఛంగా ఉంచాలంటూ ఓ వైవు ప్రధాని మోదీ పిలుపునిస్తున్నా ఆ పార్టీకి చెందిన నేతలే స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా తీసుకెళ్లేందుకు ఎంతో మంది ప్రయత్నిస్తున్నా... కొందరు నేతలు మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. తాజాగా రాజస్థాన్ బీజేపీ నేత, మంత్రి శంభూ సింగ్ ఖేటసర్ బహిరంగంగా మూత్ర విసర్జన చేసి వార్తల్లోకి ఎక్కారు. ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజెన్లు ఆయనపై విరుచుకుపడ్డారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా అజ్ మేర్ లో పర్యటిస్తున్న సందర్భంగా... ఓ గోడ వద్ద ఆయన మూత్ర విసర్జన చేశారు. ఆ గోడపైన బీజేపీ పోస్టర్ కూడా ఉండటం గమనార్హం. తనపై నెటిజెన్లు ట్రోల్ చేస్తుండటంతో... ఎట్టకేలకు ఆయన స్పందించారు. బీజేపీ పోస్టర్ వద్ద తాను మూత్ర విసర్జన చేయలేదని... ఆ ఫొటోలో ఉన్నది తాను కాదని చెప్పారు.

ఇదే విషయంపై మరోసారి స్పందిస్తూ... బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయడం తప్పు కాదని, అయితే అది నిర్మానుష్య ప్రాంతమై ఉండాలని అన్నారు. తాను మూత్ర విసర్జన చేసింది నిర్మానుష్య ప్రాంతంలో అని చెప్పారు. అలాంటి ప్రాంతంలో ఎవరైనా మూత్ర విసర్జన చేస్తే వ్యాధులు వ్యాపించవని అన్నారు. ఈ వివరణపై కూడా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతమైతే అక్కడ బీజేపీ పోస్టర్ ఎందుకు ఉందని ప్రశ్నిస్తున్నారు. బీజేపీకి సొంత పార్టీ నేతలలే చెడ్డ పేరు తెస్తున్నారని అంటున్నారు. 

  • Loading...

More Telugu News