Hyderabad: పెళ్లయి పిల్లలున్నా ‘ప్రేమ’ వల విసిరాడు...గుట్టు రట్టుకాగానే మట్టు పెట్టాలనుకున్నాడు
- ఫేస్‌బుక్ పరిచయాన్ని పెళ్లి వరకు తెచ్చిన వివాహితుడు
- విషయం తెలిసి నిరాకరించిన ప్రియురాలు
- యువతిని కౌగిలించుకుని నిప్పంటించుకున్న వైనం
అతనికి పెళ్లయింది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. కానీ బ్రహ్మచారినని నమ్మించాడు. ఫేస్ బుక్‌లో పరిచయమైన యువతిపై ప్రేమ వల విసిరాడు. పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. తీరా యువతి సోదరుని ద్వారా గుట్టు రట్టు కావడంతో ప్రియురాలు పెళ్లికి ససేమిరా అంది. అంతే, ఆమెను చంపేసేందుకు తెగించాడు. ఈ ఘటనలో యువతి చనిపోగా అతను తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్ నగరంలో సంచలనమైన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలావున్నాయి.
పాతబస్తీ బర్కాన్‌కు చెందిన ఇబ్రహీం (30) సెల్‌ఫోన్‌లు మరమ్మతు చేస్తుంటాడు. ఉపాధి నిమిత్తం ఐదేళ్ల క్రితం బహ్రెన్ వెళ్లాడు. రెండేళ్ల క్రితం ఇతనికి హైదరాబాద్ టప్పాచబుత్ర కుమ్మరివాడకు చెందిన షబానా బేగం (18)తో ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. ఇద్దరూ తరచూ సంభాషించుకునేవారు. తనకు పెళ్లికాలేదని అబద్ధం చెప్పి ఇబ్రహీం ఆరు నెలల క్రితం షబానా వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ఆమె అంగీకరించడంతో బహ్రెన్ నుంచి హైదరాబాద్ వచ్చాడు.
యువతి సోదరుడితో మాట్లాడి మళ్లీ బహ్రెన్ వెళ్లాడు. పెళ్లి దగ్గర పడడంతో మూణ్నెళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాడు. బంగారం కానుకగా ఇచ్చేందుకు ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా ఇబ్రహీం చిరునామా, వివరాలు తెలుసుకున్న షబానా సోదరుడు ముస్తఫా వాటిపై ఆరాతీశాడు. ఈ క్రమంలో అతనికి పెళ్లయిందని, పిల్లలున్నారని తెలియడంతో షాక్ అయ్యాడు. విషయాన్ని సోదరికి చెప్పాడు. దీంతో ఆమె ఇబ్రహీంతో పెళ్లికి నిరాకరించింది. అనంతరం ఇబ్రహీం ఆ యువతిని వేధించడం మొదలుపెట్టాడు.
విసిగిపోయిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఇబ్రహీం కుటుంబ సభ్యులను పిలిచి హెచ్చరించారు. దీంతో మరింత పగ పెంచుకున్న ఇబ్రహీం ఆమెపై కక్షతీర్చుకోవాలనుకున్నాడు. వారం రోజుల క్రితం హైదరాబాద్ వచ్చాడు. ఉదయాన్నే మద్యం సేవించాడు. సీసాలో పెట్రోల్ పట్టుకుని ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. తనతో పెళ్లికి అంగీకరిస్తే మొదటి భార్య, పిల్లల్ని ఇక్కడే వదిలేసి నిన్ను బహ్రెన్ తీసుకు వెళ్తానని షబానాకు చెప్పాడు.
ఆమె నిరాకరిస్తూ తలుపు వేసేందుకు ప్రయత్నించగా బలవంతంగా తోసుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. ప్రియురాలిని కౌగిలించుకుని పెట్రోల్ పోసి నిప్పంటించాడు. సమీపంలో ఉన్న ముస్తఫా భార్య మంటలార్పే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడింది. ఈలోగా చుట్టుపక్కల వారు వచ్చి మంటలార్పి గాయపడిన వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ షబానా రాత్రి 8 గంటల సమయంలో చనిపోయింది. మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసు తెలిపారు.