Andhra Pradesh: అవినీతి ఆరోపణల విషయంలో మాటమార్చిన హోటల్ యజమాని.. జైలుశిక్ష, జరిమానా విధించిన కోర్టు!

  • ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో ఘటన
  • ప్రభుత్వ అధికారులకు లంచం కేసులో తీర్పు
  • అవినీతి నిరోధక చట్టాన్ని ఇటీవల సవరించిన కేంద్రం

సాధారణంగా ఏ కేసులో అయినా తొలుత ఏ వాంగ్మూలం అయితే ఇచ్చామో, చివరివరకూ దానికే కట్టుబడి ఉండాలి. లేదంటే కేసును గెలవడం కష్టమైపోతుంది. కానీ అవినీతి కేసులో ప్రభుత్వ అధికారులపై ఫిర్యాదు చేసిన ఓ హోటల్ యజమాని.. ఆ తర్వాత మాట మార్చాడు. దీంతో తిక్కరేగిన కోర్టు సదరు హోటలియర్ కు జైలుశిక్షతో పాటు జరిమానా విధించింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని రేపల్లెకు చెందిన గుండు రామలింగేశ్వరరావు ఓ హోటల్ ను నిర్వహిస్తున్నాడు. ఈ హోటల్ అసెస్ మెంట్ అనుమతుల కోసం 1993లో వాణిజ్య పన్నుల అధికారులను సంప్రదించగా లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా వాణిజ్యపన్నుల డీసీటీఓ మందలపు వీరయ్య, సీనియర్‌ అసిస్టెంట్‌ కె.త్రిమూర్తిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే తొలుత అధికారులు లంచం డిమాండ్ చేశారని ఫిర్యాదు చేసిన రామలింగేశ్వరరావు.. ఆ తర్వాత విచారణ సందర్భంగా మాట మార్చారు.

ఈ కేసును విచారించిన విజయవాడ మూడో మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ న్యాయస్థానం సదరు హోటలియర్ కు షాక్ ఇచ్చింది. తొలుత సాక్ష్యం చెప్పి, ఆ తర్వాత మాట మార్చినందుకు ఆరు నెలల జైలుశిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించింది. ప్రభుత్వ అధికారులను ఈ కేసులో నిర్దోషులుగా విడుదల చేసింది. ఏసీబీ చరిత్రలో ఇదో అరుదైన తీర్పుగా కోర్టు వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రం ఇటీవల ఆమోదించిన అవినీతి నిరోధక చట్టం ప్రకారం లంచం తీసుకోవడంతో పాటు ఇవ్వడం కూడా నేరమే.

  • Error fetching data: Network response was not ok

More Telugu News