Jayalalitha: జయలలిత మృతి కేసు.. పోలీసుల ఆదేశాలతోనే సీసీ టీవీ కెమెరాలను ఆఫ్ చేశామన్న అపోలో ఆసుపత్రి!

  • పోలీసులు ఆపేయమన్నారు.. ఆపేశాం
  • జయలలిత భద్రతను దృష్టిలో పెట్టుకునే ఆ పనిచేశాం
  • తొలి హెల్త్ బులెటిన్‌ను జయ కూడా చూశారు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతి కేసులో రోజుకో విషయం వెలుగు చూస్తోంది. ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ ముందు ఒకరు చెబుతున్న విషయానికి, ఇంకొకరు చెబుతున్న విషయానికి అస్సలు పొంతన ఉండడం లేదు. గతంలో తమ వద్ద 30 రోజుల సీసీ టీవీ ఫుటేజీలు మాత్రమే ఉన్నాయన్న అపోలో యాజమాన్యం.. తాజాగా, జయలలితకు చికిత్స అందించిన  గదికి దగ్గర్లోని సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేసినట్టు విచారణ కమిటీకి తెలిపింది. పోలీసుల ఆదేశాలతోనే వాటిని ఆఫ్ చేసినట్టు పేర్కొంది.

జయకు చికిత్స అందించిన గది, ఐసీయూ, ఆ గది ప్రాంగణం, ఎంట్రన్స్‌తోపాటు ఇతర ప్రదేశాల్లోని సీసీటీవీలను కూడా పోలీసుల ఆదేశాలతో ఆపి వేసినట్టు ఆసుపత్రి తెలిపింది. జయను స్కానింగ్‌కు తీసుకెళ్లిన సమయంలో అక్కడ ఉన్న కెమెరాలను కూడా ఆఫ్ చేసినట్టు పేర్కొంది. జయ భద్రతను దృష్టిలో పెట్టుకునే ఇలా చేయాల్సి వచ్చిందని విచారణ కమిటీకి సమర్పించిన నివేదికలో అపోలో స్పష్టం చేసింది.

జయలలిత ఆరోగ్యంపై 23 సెప్టెంబరు 2016న విడుదల చేసిన తొలి బులెటిన్‌ను రూపొందించే విషయంలో జయలలిత కూడా పాలు పంచుకున్నారని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ప్రెస్ రిలీజ్ వల్ల ప్రజల్లో భయం పోతుందని స్వయంగా ఆమె చెప్పారని పేర్కొంది. ఈ ప్రెస్ నోట్‌కు‌‌ రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ రామ్‌మోహనరావు, హెల్త్‌ సెక్రటరీ జె.రాధాకృష్ణన్ ఆమోదం తెలిపిన తర్వాతే విడుదల చేసినట్టు పేర్కొంది. జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న ఏకసభ్య కమిషన్ ఎదుట గవర్నర్‌ విద్యాసాగర్‌రావు‌, రమేశ్‌ చంద్‌ మీనా, అపోలో ఆసుపత్రులకు చెందిన సుబ్బయ్య విశ్వనాథన్‌ హాజరయ్యారు.

Jayalalitha
Tamil Nadu
Chennai
Appolo Hospitals
CCTV
  • Loading...

More Telugu News