meng nongvie: ఇంటర్‌పోల్ చీఫ్‌ని నిర్బంధంలోకి తీసుకున్న చైనా!
- ఫ్రాన్స్ నుంచి కనిపించకుండా పోయిన మెంగ్
- పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య
- ఏ విషయంలో విచారిస్తున్నారనేది అస్పష్టం
ఇటీవల కనిపించకుండా పోయిన ఇంటర్‌పోల్ అధ్యక్షుడు మెంగ్ హోంగ్‌వీ చైనా అధికారుల నిర్బంధంలో వున్నట్టు సమాచారం. చైనాకు చెందిన మెంగ్ 2016లో ఇంటర్ పోల్ చీఫ్‌గా నియమితులయ్యారు. ఇంటర్‌పోల్ ప్రధాన కార్యాలయం ఉన్న ఫ్రాన్స్‌లోని లైయాన్ నగరంలో తన నివాసం నుంచి వెళ్లిన మెంగ్ కనిపించకుండా పోయారు. దీంతో ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరిగా ఆయన సెప్టెంబర్ 29న కనిపించారని, తర్వాత ఎలాంటి సమాచారం లేదని ఆయన భార్య ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మెంగ్ తన సొంత దేశమైన చైనాకు వెళ్లినట్టు తెలిపారు.
మెంగ్ ఫ్రాన్స్ నుంచి చైనా వెళ్లగానే అక్కడి అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ అంశంపై చైనా మౌనంగా ఉంది. ప్రజా భద్రత శాఖ మంత్రి గానీ, విదేశాంగశాఖ మంత్రి గానీ దీనిపై స్పందించలేదు. సొంత దేశపు అధికారులే మెంగ్‌ను నిర్బంధంలోకి తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఏ విషయంపై మెంగ్‌ను విచారిస్తున్నారనే దానిపై స్పష్టత లేదు.
చైనా నిబంధనల ప్రకారం ఎవరినైనా అనుమానితుడిగా అదుపులోకి తీసుకుంటే వారి కుటుంబ సభ్యులకు, లేదంటే పనిచేసే సంస్థ యాజమాన్యానికి 24 గంటల్లోగా తెలియజేయాలి. అయితే మెంగ్ భార్యకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. చైనా అధికారులు మెంగ్‌ను వివిధ కోణాల్లో విచారిస్తున్నారని అక్కడి మీడియా కథనాల్లో వెల్లడైంది. మెంగ్ ఇంటర్‌పోల్ అధ్యక్షుడే కాకుండా చైనాలో ప్రజా భద్రత విభాగంలో ఉప మంత్రి కూడా. 2020వరకు ఆయన పదవీ కాలం ఉంది. మెంగ్ ఇంటర్‌పోల్ చీఫ్‌గా ఎంపికైన తొలి చైనా దేశస్థుడు.