election commission: తెలంగాణ ఎన్నికల్లో గరిష్టంగా ఎంత ఖర్చు పెట్టవచ్చంటే.. వివరాలు వెల్లడించిన కేంద్ర ఎన్నికల కమిషన్!
- మిజోరాం, మధ్యప్రదేశ్ కు ఒకేసారి ఎన్నికలు
- తెలంగాణ, రాజస్తాన్ కు ఒకేవిడతలో పోలింగ్
- గరిష్ట వ్యయంపై క్లారిటీ ఇచ్చిన సీఈసీ ఓపీ రావత్
తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరాం, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేసింది. డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించి అదే నెల 11న ఫలితాలను వెల్లడిస్తామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ తెలిపారు. ఈ సందర్భంగా అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితి గురించి ఆయన ప్రకటించారు. మిజోరాంలో ఒక్కో అభ్యర్థి గరిష్టంగా రూ.20 లక్షల వరకూ ఖర్చు పెట్టవచ్చన్నారు. ఇక మిగిలిన తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఒక్కో అభ్యర్థి గరిష్టంగా రూ.28 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టేందుకు వీలుందన్నారు.
ఈ ఎన్నికల కోసం వీవీప్యాట్ యంత్రాలను అందుబాటులోకి తెస్తామని రావత్ అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తెలంగాణ ఓటర్ల జాబితాను అక్టోబర్ 12న ప్రకటిస్తామన్నారు. నవంబర్ 19 వరకూ అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేసుకోవచ్చని, 22 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని వెల్లడించారు. సాధారణంగా అసెంబ్లీ రద్దయిన 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. తెలంగాణతో పాటు రాజస్తాన్ కు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. తాజా ప్రకటనతో పూర్తిస్థాయిలో తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినట్లయింది.