Telangana: పాలమూరు జిల్లాకు ఏం చేశారో కేసీఆర్ చెప్పాలి : కాంగ్రెస్ నేత డి.కె.అరుణ
- జిల్లాకు నీరిచ్చానని చెప్పడానికి సిగ్గుండాలి
- ఆయన ఎంత మోసగాడో ప్రజలకు తెలిసిపోయింది
- సీఎం మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నట్లుంది
‘ఓటమి భయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పాలమూరు జిల్లాకు నీరిచ్చానని ఆయన చెప్పుకోవడం సిగ్గుచేటు. నీరే కాదు, అసలు ఆయన జిల్లాకు ఏం చేశారో ఓసారి చెప్పాలి’ అని కాంగ్రెస్ నేత డి.కె.అరుణ మండిపడ్డారు. వనపర్తి సభలో కేసీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కేసీఆర్ మాటలు చూస్తుంటే మతుండే మాట్లాడుతున్నాడా అనిపిస్తోందని, ఆయన కొంచెం సంస్కారం నేర్చుకుంటే బాగుంటుందని సూచించారు. కేసీఆర్‌వి అసలు ముఖ్యమంత్రి స్థాయి మాటలేనా? అని ప్రశ్నించారు. తెలంగాణలో పుట్టిన కేసీఆర్‌కు ఇంత నీచ సంస్కృతి ఎలా వచ్చిందన్నారు. తానేమిటో గద్వాల ప్రజలకు తెలుసునని స్పష్టం చేశారు. తాను రఘువీరారెడ్డికి మంగళ హారతులు పట్టినట్లు ఆయన వద్ద ఏమైనా వీడియో ఆధారాలుంటే చూపాలని సవాల్ విసిరారు.
దుబాయ్‌కి మనుషులను అమ్మి దుబాయ్ శేఖర్‌గా పేరొందిన కేసీఆర్ తన గురించి మాట్లాడుతున్నప్పుడు ఓ శక్తితో మాట్లాడుతున్నానని గ్రహించాలని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ తెలంగాణ రాక్షసులు, రాబందుల పార్టీ అన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర ఏముందని, అసలు కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. నిమ్స్‌కు వెళితే కేసీఆర్ దీక్ష భాగోతం బయటపడుతుందన్నారు. తెలంగాణ అమర వీరులకు సీఎం చేసిందేమిటో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.