jc prabhakar reddy: టీవీ సీరియల్స్ పై మండిపడ్డ ఎమ్మెల్యే జేసీ.. మహిళలకు సూటి ప్రశ్న!
- ఈర్ష్య, ద్వేషాలను పెంచుతున్నాయని వ్యాఖ్య
- వీటితో ప్రయోజనం ఏముందని మహిళలకు ప్రశ్న
- దుల్హన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
టీవీ సీరియల్స్ అనగానే చాలామంది మగాళ్లకు కోపం వస్తుంది. తాము ఇంచికొచ్చినా పట్టించుకోకుండా ఆడవాళ్లు టీవీలకు అతుక్కుపోయిన సందర్భాల్లో వీరి కోపం నషాళానికి అంటుతుంది. తాజాగా ఈ టీవీ సీరియల్స్ వ్యవహారంపై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. వీటి కారణంగా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదని వ్యాఖ్యానించారు. అసలు వీటివల్ల ప్రయోజనం ఏముంది? అని మహిళలను డైరెక్టుగా ప్రశ్నించారు. తాడిపత్రిలోని జేసీ నాగిరెడ్డి షాదీఖానాలో జరిగిన దుల్హన్ పథకం మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ఇప్పుడు వస్తున్న టీవీ సీరియల్స్ లో అసలు నీతి ఉందా? కేవలం ధనార్జనే ధ్యేయంగా సీరియల్స్ తీస్తున్నారు. వీటివల్ల జనాలకు ఎలాంటి ప్రయోజనం లేదు. కేవలం కుటుంబాల్లో అసూయ, ఈర్ష్య, ద్వేషాలు, పగ, ప్రతీకారాలు మాత్రం ఇవి రెచ్చగొడుతున్నాయి. మానవ సంబంధాలు, కుటుంబ విలువలు తగ్గిపోయేలా సీరియల్స్ తీస్తున్నారు’ అని ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మైనార్టీల కోసం దుల్హన్ పథకం ప్రవేశపెట్టారని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ పథకం ద్వారా వచ్చే రూ.50 వేలను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడమో, స్వయం ఉపాధి కోసం ఉపయోగించడమో చేయాలన్నారు. మహిళల్లో 100 శాతం అక్షరాస్యత ఉన్నపుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ సందర్భంగా వక్ఫ్‌బోర్డు అధ్యక్షుడు జాకీర్ మాట్లాడుతూ.. తాడిపత్రిలో మైనార్టీల అభివృద్ధి కోసం జేసీ సోదరులు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. వారికి మైనార్టీలు రుణపడి ఉండాలన్నారు.