Shahbaz Sharif: నవాజ్ షరీఫ్‌కు మరో షాక్.. ఆయన సోదరుడు, పాక్ ప్రతిపక్ష నేత షాబాజ్ షరీఫ్ అరెస్ట్!
- 18 బిలియన్ పాకిస్థానీ రూపాయల అవినీతి ఆరోపణలు
- నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్
- నేడు అకౌంటబులిటీ కోర్టులో హాజరు
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు, పాక్ ప్రతిపక్ష నేత షాబాజ్ షరీఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు అవినీతి కేసులు ఎదుర్కొంటున్న ఆయనను శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం లాహోర్‌లో నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో ఎదుట షాబాజ్ హాజరయ్యారు. వారడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పకుండా నీళ్లు నమలడంతో అదుపులోకి తీసుకున్నారు.
ఆషియానా హౌసింగ్ పథకం, పంజాబ్ సాఫ్ పానీ కంపెనీ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ అప్పగించినట్టు షాబాజ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు ఎన్ఏబీ అధికార ప్రతినిధి నవాజిష్ అలీ అసిం తెలిపారు. షాబాజ్‌పై మొత్తం 18 బిలియన్ పాకిస్థానీ రూపాయల అవినీతి ఆరోపణలు ఉన్నాయి. షాబాజ్‌ను నేడు అకౌంటబులిటీ కోర్టులో హాజరు పరచనున్నట్టు పేర్కొన్నారు.