Dasara: దసరా సీజన్: హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. వివరాలు!
- వివిధ ప్రాంతాలకు 4,480 ప్రత్యేక సర్వీసులు
- హైదరాబాద్ శివార్ల నుంచి బయలుదేరనున్న బస్సులు
- 50 శాతం అదనపు చార్జీ వసూలు చేస్తామన్న అధికారులు
దసరా పండగ వచ్చేస్తోంది. స్కూలు విద్యార్థులకు వరుస సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడిన వారు, సొంత గ్రామాలకు బయలుదేరేందుకు సిద్ధపడుతున్నారు. రైళ్లలో బెర్తుల రిజర్వేషన్లు నెలరోజుల క్రితమే పూర్తయిన నేపథ్యంలో, నగరం నుంచి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకూ 4,480 బస్సులను నడపనున్నట్టు తెలంగాణ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఈ బస్సులను 8 నుంచి 18 వరకూ నడుపుతామని, ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలను వసూలు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
కర్నూలు, తిరుపతి, అనంతపురం, కడప తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఎంజీబీఎస్ నుంచి నడుపుతారు. విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, విశాఖపట్నం, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఎల్ బీనగర్ నుంచి నడుపుతారు. మెదక్, బాసర, ఆదిలాబాద్ తదితర ప్రాంతాలకు కూకట్ పల్లి నుంచి, కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లే బస్సులను జూబ్లీ బస్టాండు నుంచి, వరంగల్, ఖమ్మం బస్సులను ఉప్పల్ నుంచి నడపనున్నారు. ప్రత్యేక బస్సులకు సంబంధించిన టికెట్లను ఆయా ప్రాంతాల్లోని అధీకృత టికెట్ బుకింగ్ కేంద్రాలతో పాటు ఆన్ లైన్ ద్వారా కూడా పొందవచ్చని అధికారులు తెలిపారు.
నిత్యమూ 1.25 లక్షల మంది హైదరాబాద్ నుంచి ప్రయాణాలు సాగిస్తుంటారని, దసరా సీజన్ లో ఈ సంఖ్య 1.60 లక్షలను దాటే అవకాశం ఉన్నందున ఆ మేరకు ప్రత్యేక బస్సులను నడుపుతామని తెలిపారు. 8 నుంచి 15 వరకూ 1981 ప్రత్యేక బస్సులను సిద్ధం చేశామని, ఆపై 16 నుంచి 18 వరకూ 2,499 బస్సులను నడుపుతామని తెలిపారు. ఈ సీజన్ లో బస్సులకు అత్యధిక డిమాండుండే 16న 1,110 బస్సులు, 17న 1,085 ప్రత్యేక బస్సులను డిమాండ్ ను బట్టి ఆయా ప్రాంతాలకు పంపేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ బస్సులకు టికెట్లను http://www.tsrtconline.in వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని తెలిపారు.
ఈ ప్రత్యేక బస్సులు తెలంగాణ, ఏపీల్లోని అన్ని జిల్లా కేంద్రాలతో పాటు తెనాలి, గుడివాడ, రాజమండ్రి, రాజోలు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపురం, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కందుకూరు, పామూరు, పొదిలి తదితర ప్రాంతాలకు నడుపుతామని అధికారులు వెల్లడించారు.