satish mahana: ఆ మంత్రి ఎంత పేదవారో.. ఆయుష్మాన్ భారత్ పథకంలో లబ్ధిదారులుగా మంత్రి, కుటుంబ సభ్యులు!
- ఆయుష్మాన్ భారత్ పథకంలో లబ్ధిదారులుగా మంత్రి
- విచారణకు ఆదేశించిన డిప్యూటీ సీఎం
- అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరిక
ఉత్తరప్రదేశ్ మంత్రి సతీశ్ మహానా, ఆయన కుటుంబ సభ్యులు ఎంత పేదవారో తెలియాలంటే కేంద్రం ప్రవేశపెట్టిన ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ జాబితా వెతకాల్సిందే. దారిద్య్ర రేఖ దిగువన ఉన్న వారి కోసం ఉద్దేశించిన ఈ పథకంలో మంత్రి సతీశ్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యుల పేర్లు కూడా లబ్ధిదారుల జాబితాలో ఉన్నాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తెలిపారు.
లబ్ధిదారుల జాబితాలోకి మంత్రి, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించినట్టు మౌర్య తెలిపారు. మంత్రి పేర్లను లబ్ధిదారుల జాబితాలో చేర్చిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కనీస వైద్యం చికిత్స కోసం కూడా ఖర్చు చేయలేని వారి కోసమే ఈ కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి వివరించారు. ఈ పథకం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.