Bangkok: విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు.. ఆసుపత్రికి తరలించే లోపే మృతి!

  • బ్యాంకాక్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఘటన
  • మార్గమధ్యంలో గుండెపోటుకు గురైన 53 ఏళ్ల అటబోట్
  • వారణాసిలో విమానం అత్యవసర ల్యాండింగ్

విమాన ప్రయాణంలో ఉండగా ఓ వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. బ్యాంకాక్ నుంచి ఢిల్లీ వస్తున్న స్పైస్‌జెట్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం 189 మంది ప్రయాణికులతో బ్యాంకాక్ నుంచి విమానం ఢిల్లీ బయలుదేరింది. ప్రయాణికుల్లో థాయ్‌లాండ్‌కు చెందిన 22 మందితో కూడిన పర్యాటకుల బృందం ఉంది. ఈ బృందంలో ఉన్న 53 ఏళ్ల అటబోట్  గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యారు.  

విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది వెంటనే సమీపంలోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం సిబ్బందికి సమాచారం ఇచ్చి వారణాసిలో విమానాన్ని దించేశారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న సిబ్బంది అటబోట్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్టు తెలిపారు. అటబోట్‌తో ప్రయాణిస్తున్న వారిలో ఆయన భార్య, సోదరితోపాటు మరో ఏడుగురు కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్టు విమాన సిబ్బంది తెలిపారు. అటబోట్ మృతిపై భారత్‌లోని థాయ్‌లాండ్ రాయబార కార్యాలయానికి సమాచారం అందించినట్టు అధికారులు తెలిపారు.

Bangkok
New Delhi
Spicejet
Heart attack
Tailand
  • Loading...

More Telugu News