The Nobel Peace Prize: అత్యాచారాలపై సమరానికి గాను.. ఇద్దరికి నోబెల్ శాంతి బహుమతి!

  • కాంగో అత్యాచారాలపై ఉద్యమించిన డా.డెవిస్
  • ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల దుశ్చర్యలపై నదియా పోరాటం
  • రూ.7.35 కోట్లను అందుకోనున్న విజేతలు

ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి ఈ ఏడాది ఇద్దరికి లభించింది. కాంగోకు చెందిన గైనకాలజిస్ట్ డెనిస్ ముక్‌వెగె, 2014లో ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) ఉగ్రవాదుల చేతిలో గ్యాంగ్ రేప్ కు గురైన యాజిదీ తెగ యువతి నదియా మురాద్ లను సంయుక్తంగా ఈ అత్యున్నత పురస్కారం వరించింది. యుద్ధ రంగంలో లైంగికదాడిని, అత్యాచారాలను ఓ ఆయుధంగా వాడటంపై వీరు చేసిన పోరాటానికి గానూ నోబెల్ అకాడమీ వీరిని శాంతి బహుమతితో గౌరవించింది.

ఈ అవార్డు కింద అందనున్న 7.35 కోట్ల(9 మిలియన్ స్వీడిష్ క్రోనాల)ను  ఇద్దరు విజేతలు సమంగా పంచుకోనున్నారు. ప్రపంచంలో అత్యాచారాలు, ఘర్షణలు అధ్యధికంగా చెలరేగే దేశంగా కాంగోకు పేరుంది. అక్కడ రోజుకు కొన్ని వందల సంఖ్యలో అత్యాచారాలు జరుగుతాయి. వేర్వేరు తెగలు, నాయకుల మధ్య జరిగే అంతర్గత సాయుధ ఘర్షణల్లో సాధారణ మహిళలపై సైనికుల అత్యాచారాల పర్వం కొనసాగుతోంది.

1990 దశకంలో వీటి సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. అప్పటి నుంచి ముక్‌వెగె వీటికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. బాధితులకు చికిత్స అందించడంతో పాటు చదువు నేర్పించి, తమ కాళ్లపై తాము నిలబడేట్లు చేస్తున్నారు. అంతేకాకుండా నిందితులకు శిక్ష పడేందుకు పోరాడుతున్నారు. ఇక నదియా మురాద్(25)ను ఇరాక్ లో ఉండగా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు 2014లో ఆమె ఊరిపై దాడిచేశారు. అదే గ్రామానికి చెందిన వందలాది మంది యాజిదీ జాతి పురుషులను, వృద్ధ మహిళలను కాల్చిచంపారు.


అనంతరం నదియా సహా వందలాది మంది యాజిదీ జాతి మహిళలపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. కొన్ని రోజుల అనంతరం నదియాను అమ్మేశారు. చివరికి ఆమె ఎలాగోలా ఐఎస్ఐఎస్ చెర నుంచి తప్పించుకుని బయటకు వచ్చింది. తన కుటుంబ సభ్యులతో పాటు మిగతా గ్రామస్తులను చంపిన ఉగ్రవాదులకు శిక్ష పడేందుకు పోరాడుతోంది. ఉగ్ర చర్యల కారణంగా మానసికంగా, శారీరకంగా కుంగిపోయిన యువతులు, మహిళలకు నదియా అండగా నిలబడింది. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ 2018 సంవత్సరానికి అకాడమీ నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించింది.

The Nobel Peace Prize
2018
Denis Mukwege
Nadia Murad
congo
iraq
rape
sexual exploitation
in war
Rs.7.35 crores
  • Loading...

More Telugu News