komatireddy: 12లో 10 సీట్లు గెలవకపోతే.. నేను గెలిచినా రాజీనామా చేస్తా: కోమటిరెడ్డి
- నల్గొండ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరం
- జగదీష్ రెడ్డి దోచుకోవడానికే దామరచర్ల ప్లాంట్
- దోపిడీదారులు, రౌడీలకే కేసీఆర్ టికెట్లు ఇచ్చారు
నల్గొండ జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 10 స్థానాల్లో గెలుస్తుందని... లేకపోతే తాను గెలిచినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని చెప్పారు. మంత్రి జగదీష్ రెడ్డి, ఆయన అనుచరులు దోచుకోవడానికే దామరచర్ల థర్మల్ ప్లాంట్ ను నిర్మిస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ప్లాంట్ ను మూసివేయిస్తామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 30 వేల కోట్లు దోచుకున్నారని... ఎస్ఎల్బీసీలో కమిషన్లు రావనే దాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. దోపిడీదారులు, రౌడీలకే కేసీఆర్ టికెట్లు ఇచ్చారని... వారిని గెలిపిస్తే నల్గొండ జిల్లాలో నిత్యం దోపిడీలు, హత్యలే ఉంటాయని చెప్పారు. నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు విమర్శలు గుప్పించారు.