vanaparti: జోరులో గులాబీ కారు.. వనపర్తిలో నేడు ప్రజా ఆశీర్వాద సభ!
- నాగవరంలో 100 ఎకరాల్లో సభాస్థలి
- ఏర్పాట్లలో జూపల్లి, లక్ష్మారెడ్డి, జితేందర్ రెడ్డి
- భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు
నిజామాబాద్, నల్గొండ ప్రజా ఆశీర్వాద సభలు విజయవంతమైన నేపథ్యంలో గులాబీ రథసారధి కేసీఆర్ మరింత జోష్ తో ముందుకు పోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు వనపర్తి జిల్లాలో మూడో ప్రజా ఆశీర్వాద సభను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం జిల్లా కేంద్రంలోని నాగవరంలో100 ఎకరాల్లో సభా స్థలితో పాటు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. వాహనాల పార్కింగ్ కు మరో 600 ఎకరాలను సిద్ధం చేశారు. ఈ సమావేశానికి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి దాదాపు 3 లక్షల మందిని సమీకరించి సభను విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి.
గత వారం రోజులుగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి ఈ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభా వేదిక వద్దకు సీఎం కేసీఆర్ వచ్చేందుకు వీలుగా సమీపంలోనే హెలిప్యాడ్ ను సైతం అధికారులు సిద్ధం చేశారు. సభ భద్రతా చర్యలపై ఐజీ స్టీఫెన్ రవీంద్ర పలుమార్లు పర్యవేక్షించారు. మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల ఎస్పీలు రెమా రాజేశ్వరి, అపూర్వరావు భద్రతను కట్టుదిట్టం చేశారు.