puja: పూజల పేరుతో యువకుడికి శఠగోపం.. రూ.13 లక్షలు నొక్కేసిన దొంగ జ్యోతిష్యుడు!
- పూజల పేరుతో భారీగా వసూలు
- లేదంటే గ్రహాలు తిరగబడతాయని హెచ్చరిక
- అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు
నీ కష్టాలను పోగొడతా అని చెప్పాడు. గ్రహాలన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నాయని భయపెట్టాడు. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే పూజలు వికటిస్తాయని బెదరగొట్టాడు. చివరికి బాధితుడి తల్లి ఫిర్యాదుతో ఈ నకిలీ డిజిటల్ జ్యోతిష్యుడిని పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు. ఈ ఘటన తెలంగాణలోని రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
రాజస్తాన్ కు చెందిన ఆకాశ్ శర్మ అలియాస్ ఆకాశ్ భార్గవ కేవలం 8వ తరగతి వరకూ చదువుకున్నాడు. వాళ్లను వీళ్లనూ చూసి బతుకుదెరువు కోసం ‘8 ఆస్ట్రాలజీ’ పేరుతో జ్యోతిష్యశాస్త్రం వెబ్ సైట్ ఓపెన్ చేశాడు. కుటుంబ, ఆరోగ్య, ఆర్థిక కష్టాలను చిటికెలో తీర్చేస్తాననీ, ఓసారి పూజలు చేస్తే కష్టాలు మటుమాయం అవుతాయని చెప్పేవాడు. దీంతో రామాంతపూర్ కు చెందిన ఓ యువకుడు ఆకాశ్ ను ఆశ్రయించాడు. తన వ్యక్తిగత, వైవాహిక జీవితంలో తన కష్టాలను, ఇటీవల ఉద్యోగం కోల్పోవడాన్ని సదరు యువకుడు ఆకాశ్ కు చెప్పాడు.
దీంతో తొలుత రూ.2 వేలు వసూలు చేసిన ఆకాశ్, ఈ పూజలు చేయాలి.. ఆ పూజలు చేయాలి అంటూ బాధితుడి నుంచి భారీగా నగదును గుంజడం ప్రారంభించాడు. ఇలా కేవలం నెల రోజుల్లో ఆన్ లైన్ ద్వారా ఏకంగా రూ.13 లక్షలు లాగేశాడు. ఇంకా నగదు ఇవ్వకుంటే గ్రహాలు తిరగబడి మరింత అరిష్టం జరుగుతుందని హెచ్చరించాడు. దీంతో సదరు యువకుడు మానసికంగా కుంగిపోయాడు. దీన్ని గమనించిన అతని తల్లి జానకి ప్రశ్నించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో వీరిద్దరూ కలిసి రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.
కేసును నమోదు చేసిన పోలీసులు నిందితుడి కదలికలపై పక్కా నిఘా ఉంచారు. అనంతరం పంజాబ్ లోని జలంధర్ లో ఆకాశ్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. ఆ తర్వాత నిందితుడి నుంచి రూ.13 లక్షలు రికవరీ చేసి బాధితుడికి అప్పగించారు. రాజస్థాన్ జున్‌జూ ప్రాంతానికి చెందిన ఆకాశ్ శర్మ 8వ తరగతి చదివి ఆపేశాడు.
అతని కుటుంబం జలంధర్ కు వలస వెళ్లగా, ఆకాశ్ తండ్రి రాజు భార్గవ్ కూడా జ్యోతిష్యాలు చెబుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆకాశ్ శర్మ అలియాస్ ఆకాశ్ భార్గవ్(19) ఖాళీ సమయంలో ఇంటర్నెట్‌పై ఆసక్తి పెంచుకుని మంచి పట్టు సాధించాడు. తన తండ్రి జ్యోతిష్యపు మాటలను అలవాటు చేసుకుని వాటి ద్వారా అమాయకులను మాయ చేయాలని పథకం రచించాడు. ఈ నేపథ్యంలో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.