nota: నోటా విషయంలో కాంగ్రెస్ నాయకులే గొడవ చేస్తున్నారు!: దేవరకొండ
- గీతగోవిందం పైరసీ వ్యక్తిగతంగా కుంగదీసింది
- నాకే ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు
- నేడు ప్రపంచవ్యాప్తంగా నోటా రిలీజ్
అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ స్టార్ డమ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు అతనితో సినిమాలు చేసేందుకు చాలామంది డైరెక్టర్లు, నిర్మాతలు ముందుకు వస్తున్నారు. తాజాగా రాజకీయ నేపథ్యంలో విజయ్ నటించిన ‘నోటా’ చిత్రం నేడు ప్రజల ముందుకు రానుంది.
విలాసాలతో జీవితాన్ని ఎంజాయ్ చేసే రాజకీయ నేపథ్యంలో ఉన్న ఓ యువకుడు(విజయ్ దేవరకొండ) అనుకోని పరిస్థితుల్లో సీఎంగా బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. అప్పుడు అతను ఎదుర్కొన్న పరిస్థితులను దర్శకుడు ఆనంద్ శంకర్ నోటాలో ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తాజాగా నోటాపై రాజకీయ వివాదం చెలరేగడంపై విజయ్ దేవరకొండ స్పందించాడు.
తననే ఎందుకు వివాదాలు చుట్టుముడుతున్నాయో అర్ధం కావడం లేదని విజయ్ అన్నాడు. నోటా విషయంలో కాంగ్రెస్ నాయకులే గొడవ చేస్తున్నారని వెల్లడించాడు. ఈ విషయంలో తానేమీ ఇబ్బంది పడడం లేదని స్పష్టం చేశాడు. కానీ గీతగోవిందం సినిమా రిలీజ్ కు ముందుగానే బయటకు రావడం వ్యక్తిగతంగా కుంగదీసిందని విజయ్ వ్యాఖ్యానించాడు. ఎడిటింగ్ తర్వాత సినిమా నిడివి 2.11 గంటలైతే.. పైరసీలో ఏకంగా 2.30 గంటల సినిమా వచ్చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
సినిమాను ఇక థియేటర్లలో ఎవరూ చూడరేమోనని బాధపడ్డాననీ, కానీ ప్రజలు తమ సినిమాను విశేషంగా ఆదరించారని దేవరకొండ చెప్పుకొచ్చాడు. నోటా సినిమాను కేజీ జ్ఞానవేల్ రాజా నిర్మించగా, శ్యామ్ సీఎస్ సంగీతం సమకూర్చాడు. విజయ్ కు జోడీగా మెహ్రీన్ ఫిర్జాదా నటించగా, నాజర్, సత్యరాజ్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు.