Andhra Pradesh: సెగలు పుట్టిస్తున్న భానుడు.. తెలుగు రాష్ట్రాల్లో సూర్య ప్రతాపం!

  • ఉదయం నుంచే చురుక్కుమనిపిస్తున్న ఎండ
  • సాధారణం కంటే 3-4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత
  • ఈ నెలాఖరు వరకు అంతే

తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం పది గంటలకే చురుక్కుమనిపిస్తున్న భానుడు మధ్యాహ్నానికి మరింత విజృంభిస్తున్నాడు. తెలంగాణలో కన్నా ఏపీలో భానుడు మరింత మండిపోతున్నాడు. బుధవారం విశాఖపట్ణణంలో సాధారణం కంటే 4.2 డిగ్రీలు అధికంగా 35.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  నెల్లూరులో 36.5, ఒంగోలు, కర్నూలులో 36.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా జిల్లాల్లోనూ 35 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రం మొత్తం మీద 2 నుంచి 4 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రత నమోదైంది.

నైరుతి రుతుపవనాలు వెనక్కి వెళ్లడం, ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావం లేకపోవడమే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు ఇళ్లు, కార్యాలయాల్లో పగలు, రాత్రి ఏసీల వాడకం కూడా పెరిగింది. ఇక, గాలిలో తేమశాతం తగ్గడం, నైరుతి రుతుపవనాలు బలహీన పడడం, కొన్ని చోట్ల తిరోగమనంతో పొడివాతావరణం ఏర్పడడం వంటి వాటి వల్ల ఉష్ణోగ్రతలు పెరిగినట్టు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.

సాధారణంగా సెప్టెంబరు, అక్టోబరు నెలల్లోనూ వర్షాలు కురుస్తాయి. ఈసారి అందుకు విరుద్ధంగా ఉండడం కూడా ఇందుకు ఓ కారణమని అంటున్నారు.  ఈ నెలాఖరులో ఈశాన్య రుతుపవనాల ప్రభావం మొదలవుతుంది. అప్పటి వరకు ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదని వాతావరణ శాఖ పేర్కొంది.

Andhra Pradesh
Telangana
Sun
temperature
Visakhapatnam District
Hyderabad
  • Loading...

More Telugu News