sexual harrasment: లైంగిక వేధింపులు సినీ ఇండస్ట్రీలోనే కాదు.. అన్ని చోట్లా ఉన్నాయి!: బాలీవుడ్ నటి కాజోల్
- తనుశ్రీ దత్తా-నానా పటేకర్ వ్యవహారంపై స్పందన
- తనకైతే లైంగిక వేధింపులు ఎదురుకాలేదని వెల్లడి
- మీటూ లాంటి ఉద్యమం ఇక్కడా రావాలని ఆంకాంక్ష
మహిళలపై లైంగిక వేధింపులు ప్రతి చోటా ఉన్నాయని బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ అభిప్రాయపడింది. ఈ వేధింపులు కేవలం సినీ పరిశ్రమకే పరిమితం కాలేదనీ, అన్నిచోట్లా జరుగుతున్నాయని పేర్కొంది. తనుశ్రీ దత్తా-నానా పటేకర్ లైంగిక వేధింపుల వ్యవహారంపై ఆమె ఈ మేరకు స్పందించింది. తానెప్పుడూ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులను ఎదుర్కొనలేదని కాజోల్ స్పష్టం చేసింది. కానీ వీటి గురించి తాను విన్నానని వెల్లడించింది. లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తులెవరూ తామే చేశామని మీడియా ముందుకు రారని వ్యాఖ్యానించింది.
తన కళ్లముందు ఈ రకమైన వేధింపులు జరిగితే చూస్తూ ఊరుకోబోనని తేల్చిచెప్పింది. విదేశాల్లో వచ్చిన ‘మీ టూ’ తరహా ఉద్యమం మన దేశంలో కూడా రావాల్సిన అవసరం ఉందని కాజోల్ అభిప్రాయపడింది. ప్రసుత్తం కాజోల్ తన నూతన చిత్రం ‘హెలికాప్టర్ ఈలా’ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.