Sensex: 600 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్... స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన!
- మరో భారీ పతనం దిశగా సెన్సెక్స్, నిఫ్టీ
- భారీ నష్టాల్లో ఐటీ కంపెనీలు
- స్వల్ప లాభాల్లో బ్యాంకులు
భారత స్టాక్ మార్కెట్ మరో భారీ పతనం దిశగా సాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న సంకేతాలకు తోడు రూపాయి పతనం, పెరుగుతున్న క్రూడాయిల్ ధర, డాలర్ కు డిమాండ్, పెట్టుబడిదారుల సెంటిమెంట్ ను హరించి వేసిన వేళ, గురువారం ఉదయం నుంచి మార్కెట్లు నష్టాల బాటలోనే నడుస్తున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ, 10,650 పాయింట్ల వద్ద తనకున్న మద్దతు స్థాయిని పరీక్షించుకుంది.
ఈ ఉదయం 10.50 గంటల సమయంలో సెన్సెక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే 599.25 పాయింట్లు పతనమై, 1.67 శాతం నష్టంతో 35,376 పాయింట్ల వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ, 200.45 పాయింట్ల పతనంతో 1.85 శాతం నష్టపోయి 10,657 పాయింట్ల వద్దకు చేరింది. ఐచర్ మోటార్స్, రిలయన్స్, టెక్ మహీంద్రా, హీరో, టీసీఎస్ వంటి కంపెనీలు 5 నుంచి నాలుగు శాతం వరకూ నష్టాల్లో నడుస్తున్నాయి. ఇన్ ఫ్రాటెల్, యాక్సిస్ బ్యాంక్ యస్ బ్యాంక్ తదితర కంపెనీలు 1 నుంచి 2 శాతం లాభాల్లో ఉన్నాయి.
మార్కెట్ పతనం ఇన్వెస్టర్లను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. వెంటనే కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ కల్పించుకుని రూపాయి పతనాన్ని నిలువరించే ప్రయత్నాలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కాగా, రేపు జరిగే రిజర్వ్ బ్యాంక్ పరపతి సమీక్ష తరువాత వడ్డీ రేట్లను పావు శాతం మేరకు పెంచవచ్చన్న ఊహాగానాలు బ్యాంకుల ఈక్విటీలకు మద్దతునివ్వగా, మిగతా కంపెనీల షేర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.