Rafele: రాహుల్ గాంధీని కలిసొచ్చి... పదవికి రాజీనామా చేసిన మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే!
- రాఫెల్ విషయంలో బీజేపీ తీవ్రమైన తప్పులు
- పనిచేయని మేకిన్ ఇండియా
- రాజీనామా తరువాత ఆశిష్ దేశ్ ముఖ్ విమర్శలు
రాఫెల్ యుద్ధ విమానాల డీల్ విషయంలో బీజేపీ తీవ్రమైన తప్పులు చేసిందని ఆరోపిస్తూ, మహారాష్ట్ర ఎమ్మెల్యే ఆశిష్ దేశ్ ముఖ్ తన పదవికి రాజీనామా చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. విదర్భ రీజియన్ లోని కటోల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న ఆశిష్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని వార్దాలో కలిసి, మాట్లాడి వచ్చిన తరువాత, రాజీనామా చేయనున్నట్టు మీడియాకు వెల్లడించారు. ఆపై అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా పత్రాన్ని సమర్పించానని పేర్కొన్నారు.
కాగా, నాలుగేళ్ల క్రితం జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకూ కాంగ్రెస్ లో ఉన్న దేశ్ ముఖ్, ఆపై బీజేపీలో చేరి కటోల్ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం చేపట్టిన 'మేగ్నటిక్ మహారాష్ట్ర', కేంద్రం ఆర్భాటంగా ప్రారంభించిన 'మేకిన్ ఇండియా'లు క్షేత్రస్థాయిలో ఎటువంటి ఫలితాలనూ చూపించలేదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. దేశ యువత ఇప్పుడు రాహుల్ గాంధీపై ఎన్నో ఆశలను పెట్టుకున్నారని, వారి ఆశలను నెరవేర్చేందుకు తన వంతు సాయం చేస్తానని అన్నారు.
కాగా, ఆశిష్ దేశ్ ముఖ్ రాజీనామాను ఆమోదించలేదని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. త్వరలో శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ఉండటం, ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు తీసుకురావడం ఇష్టంలేకనే 'మహా' ప్రభుత్వం ఆయన రాజీనామాను పెండింగ్ లో ఉంచాలని భావిస్తున్నట్టు సమాచారం.