Revanth Reddy: "నాకు తెలియదు, గుర్తులేదు".. అన్ని ప్రశ్నలకూ రేవంత్ సమాధానం ఇదే!
- రేవంత్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించిన ఐటీ అధికారులు
- రూ. 50 లక్షలు ఎక్కడివన్న కోణంలోనే విచారణ
- బంధువుల కంపెనీలపైనా ఆరా
ఓటుకు నోటు కేసులో నిన్న ఆదాయపు పన్ను శాఖ అధికారుల విచారణకు హాజరైన తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, అత్యధిక ప్రశ్నలకు "నాకు తెలియదు, గుర్తులేదు" అన్న సమాధానాలే ఇచ్చినట్టు తెలుస్తోంది. స్టీవెన్ సన్ కు ఇవ్వజూపిన రూ. 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో ప్రశ్నలు సాగగా, ప్రతి ప్రశ్నకు, అది రాజకీయ వ్యవహారమని, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తనకు తెలియదని, ఎవరు తెచ్చిచ్చారో గుర్తులేదని సమాధానం ఇచ్చినట్టు ఐటీ శాఖ వర్గాలు వెల్లడించాయి. కేసు కోర్టు విచారణలో ఉన్న ఈ దశలో, తనపై ప్రశ్నలేంటని, తాను ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడబోనని ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఇక రేవంత్ బంధువుల పేర్లతో ఉన్న వ్యాపార సంస్థలు, వాటి లావాదేవీలపై అడిగిన ప్రశ్నలకూ ఆయన్నుంచి సమాధానాలను అధికారులు రాబట్టలేకపోయారు. తాను నిత్యమూ రాజకీయాల్లో తిరుగుతూ, ప్రజలను కలిసే పనిలో బిజీగా ఉంటానని, తన బంధువుల్లో ఎవరు ఏ కంపెనీలు నడుపుతున్నారన్న విషయాలపై తనకు అవగాహన చాలా తక్కువని రేవంత్ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది.
గత ఎన్నికల సమయంలో రేవంత్ ఇచ్చిన అఫిడవిట్ ను దగ్గర పెట్టుకుని ప్రశ్నించిన అధికారులు, ఆయన నాలుగున్నరేళ్ల నాటి ఆస్తులకు, ఇప్పటి ఆస్తులకు ఉన్న తేడాలపై ప్రశ్నించగా, మార్కెట్ విలువ పెరుగుతూ ఉంటే తానేం చేయగలనని, ఐదేళ్ల నాటి ధరలకు, ఇప్పటి ధరలకు తేడా ఉండదా? అని రేవంత్ ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం. కాగా, రేవంత్ ను 23న మరోసారి అధికారులు విచారించనున్నారు.