Visakhapatnam District: ఎమ్మెల్యే కిడారి హత్యకు ముందు రోజు రాత్రి నాటుకోడి విందులో పోలీసులు!
- కిడారి హత్యకు ముందు ‘ఎంజాయ్’ చేసిన పోలీసులు
- ఒడిశా, చత్తీస్‌గడ్‌లోని దండకారణ్యం నుంచి గిరిజనులు
- ఎమ్మెల్యే ఎప్పుడొస్తున్నారంటూ గిరిజనులతో ఆరా తీయించిన మావోలు
విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసు విచారణలో విస్తుగొలిపే విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే వందలమంది అనుమానితులను ప్రశ్నించిన పోలీసులకు తాజాగా మరో సరికొత్త విషయం బయటపడింది. దాడికి సహకరించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు.
జంట హత్యలకు ముందు రోజు రాత్రి పోలీసులు నాటుకోడితో డిన్నర్ చేసుకోగా, జీలుగ కల్లుతో మావోయిస్టులు విందు చేసుకున్నట్టు పోలీసుల అదుపులో ఉన్న వారు చెప్పారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసులు అసలు గ్రామాల్లోకి రావడమే మానేసినట్టు తెలుస్తోంది. పనిష్మెంటుపై అరకు ప్రాంతానికి వచ్చిన ఓ పోలీసు అధికారికి ప్రతి ఆదివారం నాటు కోడి ఉండాల్సిందేనని, శనివారం సాయంత్రం ఆయన అత్యంత సన్నిహితులతో ‘విందు’ చేసుకుంటారని సమాచారం. జంట హత్యలకు ముందు రోజు సెప్టెంబరు 22న కూడా అదే పనిలో ఆయన బిజీగా ఉన్నట్టు విచారణలో వెలుగుచూసింది.
మరోవైపు, కిడారి హత్యకు ముందు ఒడిశా, చత్తీస్‌గడ్‌లోని దండకారణ్యం నుంచి కొంతమంది గిరిజనులను అరకు రప్పించారు. వీరిలో ఎక్కువమంది మహిళలే ఉన్నారు. సెప్టెంబరు 22న రాత్రి గ్రామానికి వచ్చిన వీరంతా జీలుగ కల్లు తెప్పించుకుని తాగారు. అలాగే, వ్యూహంలో భాగంగా స్థానిక గిరిజనులతో ఎమ్మెల్యే రాక గురించి ఆరా తీయించారు. తమ గ్రామానికి ఎమ్మెల్యే ఎన్ని గంటలకు వస్తున్నారంటూ వారిని ఆరా తీసినట్టు పోలీసుల అదుపులో ఉన్న నిందితులు విచారణలో వెల్లడించారు.