Revanth Reddy: మోదీ, కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా వెనక్కి తగ్గేది లేదు: రేవంత్ రెడ్డి
- అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించారు
- ఈ నెల 23న మరోసారి విచారణకు హాజరుకావాలి
- ఐటీ, ఈడీలను ఉపయోగించడం ద్వారా ఎన్నికల్లో గెలవలేరు
కాంగ్రెస్ నేత రేవంత్ ను దాదాపు ఐదున్నర గంటల సేపు ఐటీ అధికారులు విచారించారు. విచారణ పూర్తయిన అనంతరం, మీడియాతో రేవంత్ మాట్లాడుతూ, విచారణ సందర్భంలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించారని, తన సమాధానాలకు అధికారులు సంతృప్తి చెందినందువల్లే ఈ విచారణ తొందరగా ముగిసిందని అన్నారు.
ఎవరో అందించిన లేఖను ప్రముఖంగా ప్రస్తావించి తన పరువుకు భంగం కల్గించొద్దని కోరిన రేవంత్, ఈ నెల 23న మరోసారి విచారణకు హాజరుకావాలని అధికారులు కోరారని అన్నారు. కేసీఆర్, మోదీలు ఎన్ని కుట్రలు చేసినా తాను వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఐటీ, ఈడీలను ఉపయోగించడం ద్వారా ఎన్నికల్లో గెలవలేరని, అక్రమకేసులు పెట్టగలరేమోగానీ, వాటిని నిరూపించలేరని అన్నారు. ఐటీ అధికారుల పేరిట పోలీసులు తమ బంధువుల ఇళ్లలో తనిఖీలు చేయడం దారుణమని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానని రేవంత్ చెప్పారు.