kanakamedala: కుట్రలో భాగంగానే సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ దాఖలైంది: ఎంపీ రవీంద్రకుమార్
- న్యాయపరంగానే సమర్ధంగా ఎదుర్కొంటాం
- రోస్టర్ విధానంలోనే హైకోర్టులో నియామకాలపై హర్షం
- అమరావతిలో హైకోర్టు ఏర్పాటుకు మార్గం సుగమం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డును ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి రిట్ పిటిషన్ దాఖలు చేయడంపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ స్పందించారు. కుట్రలో భాగంగానే సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ దాఖలు చేశారని విమర్శించారు. న్యాయపరంగానే సమర్ధంగా ఎదుర్కొంటామని చెప్పారు.
హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం, రోస్టర్ విధానంలోనే హైకోర్టులో నియామకాలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలపైనా ఆయన హర్షం వ్యక్తం చేశారు. రోస్టర్ విధానంలోనే న్యాయాధికారుల విభజన జరగాలన్న హైకోర్టు తీర్పునే సుప్రీంకోర్టు బలపరిచిందని అన్నారు. అవరోధాలు లేకుండా అమరావతిలో హైకోర్టు ఏర్పాటుకు మార్గం సుగమమైందని రవీంద్రకుమార్ అన్నారు.