Gujarat: నల్లధనం రారాజులు గుజరాతీలే.. బయటపెట్టిన ఐటీ శాఖ!
- ఒక్క వ్యాపారి వద్దే రూ.13 వేల కోట్ల అక్రమ సంపద
- దేశవ్యాప్తంగా రూ.65 వేల కోట్ల నల్లధనం
- సమాచార హక్కు చట్టం కింద బట్టబయలు
వ్యాపారాలకు పేరుగాంచిన గుజరాతీల వద్దే భారీగా నల్లధనం పోగుపడినట్లు ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ తెలిపింది. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు కేంద్రం ప్రకటించే స్వచ్ఛంద ఆదాయ వెల్లడి (ఐడీఎస్) పథకం కింద 2016 జూన్-సెప్టెంబర్ నెలల మధ్య రూ.65,250 కోట్ల నగదు బయటపడిందని వెల్లడించింది. ఈ మొత్తంలో గుజరాతీ ప్రజలు రూ.18,000 కోట్లు ప్రకటించారని పేర్కొంది. మొత్తం నల్లధనంలో గుజరాతీల వాటా 29 శాతంగా ఉందని ఐటీ శాఖ తెలిపింది.
ఐడీఎస్ కింద ప్రకటించిన ఆస్తుల వివరాలను తెలపాలంటూ 2016, డిసెంబర్ 21న భరత్ సిన్హ్ జాలా అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశాడు. ఈ విషయంలో రెండేళ్ల పాటు కొర్రీలు పెట్టిన ఐటీ శాఖ చివరికి వివరాలను బయటపెట్టిందన్నాడు. కాగా, గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన స్థిరాస్తి వ్యాపారి షా రూ.13,860 కోట్లతో ఈ జాబితాలో టాప్ లో నిలిచినట్లు ఐటీ శాఖ తెలిపింది. అయితే అక్రమ సంపాదన, నల్లధనానికి సంబంధించి పోలీసులు, ఉన్నతాధికారుల వివరాలను మాత్రం ఐటీ శాఖ బయటపెట్టలేదు.