Telangana: సిద్ధిపేటలో రచ్చరచ్చ.. వీధికెక్కి కొట్టుకున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు!
- ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్
- అడ్డుకున్న గోవర్ధనగిరి గ్రామస్తులు, కాంగ్రెస్ నేతలు
- పరస్పర దాడిలో పలువురికి గాయాలు
తెలంగాణలోని సిద్ధిపేటలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు ఘర్షణకు దిగారు. సిద్దిపేటలోని గోవర్ధనగిరి గ్రామంలో తాజా మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ ను స్థానికులు, కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఊరికి ఏం చేశావని ఓట్లు అడిగేందుకు వచ్చావ్? అంటూ ప్రశ్నించారు. సతీశ్ కుమార్ ప్రచారం కోసం ముందుకు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించారు. దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ గొడవలో మహిళలు కూడా దూరడంతో పరిస్థితి రణరంగంగా మారింది.
జై తెలంగాణ అంటూ నినాదాలు ఇస్తూ కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ జెండా కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను సముదాయించేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని అధికారులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.