assam: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గొగోయ్ ప్రమాణ స్వీకారం
- ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో కార్యక్రమం
- హాజరైన ప్రధాని మోదీ, మన్మోహన్, అద్వానీ
- అసోంలో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా అసోం కు చెందిన జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్ లో ఈరోజు జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్, బీజేపీ సీనియర్ నేత అద్వానీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా పలువురు నేతలు హాజరయ్యారు.
ఈరోజు సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా రంజన్ గొగోయ్ ప్రమాణ స్వీకారం చేశారు. సీజేఐగా అసోంకు చెందిన వ్యక్తి బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ దీపక్ మిశ్రా పదవీకాలం నిన్నటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయన తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన గొగోయ్ పేరును మిశ్రాతో పాటు కేంద్రం రాష్ట్రపతి కోవింద్ కు సిఫార్సు చేయగా, ఆయన ఆమోదముద్ర వేశారు.జస్టిస్ గొగోయ్ ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయ విద్య అభ్యసించారు. 1978లో అసోం (అప్పటి అస్సాం) బార్ అసోసియేషన్ లో చేరారు. 2001, ఫిబ్రవరి 28న గువాహటి హైకోర్టులో శాశ్వత జడ్జీగా నియమితులయ్యారు. 2009, సెప్టెంబర్ 10న పంజాబ్-హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. మరుసటి ఏడాది అదే హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
2012, ఏప్రిల్ 23న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. తాజాగా సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ గొగోయ్.. ఈ బాధ్యతల్లో 2019, నవంబర్ 17 వరకూ కొనసాగనున్నారు. కొన్ని రోజుల క్రితం ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి తన దగ్గర ఓ ప్లాన్ ఉందని గొగోయ్ చెప్పారు.