RX100: ‘ఆర్ఎక్స్ 100’ సినిమాను మీడియా విలన్ లా చూపిస్తోంది.. మేం ఉగ్రవాదులం కాదు!: హీరో కార్తికేయ

  • జిగిత్యాల యువకుల ఆత్మహత్యలపై స్పందన
  • ప్రజలు చనిపోవాలని ఎవ్వరూ కోరుకోరని వెల్లడి
  • ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేసిన నటుడు

జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన కూసరి మహేందర్, బంటు రవితేజ అనే పదో తరగతి విద్యార్థులు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమా ప్రేరణతోనే వీరిద్దరూ చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ తమ క్లాస్ లో చదువుతున్న మరో ఇద్దరు అమ్మాయిలను ప్రేమించారు. ఈ విషయం ఇంట్లో తెలుస్తుందని భయపడి బలవన్మరణానికి పాల్పడ్డారు. తాజాగా ఈ ఆత్మహత్యలపై ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ స్పందించాడు.

జగిత్యాల జిల్లాలో ఇద్దరు పిల్లలు చనిపోయిన ఘటనలో మీడియా ‘ఆర్ఎక్స్ 100’ సినిమాను విలన్ గా చూపిస్తోందని కార్తికేయ ఆవేదన వ్యక్తం చేశాడు. నిజం చెప్పాలంటే ఆర్ఎక్స్ 100 సినిమాలోని ‘పిల్లా రా’ అనే పాటలో హీరో ఎక్కడా చనిపోడనీ, హీరోయిన్ ఇందు అనే పాత్ర ప్లాన్ ప్రకారం హత్య చేయిస్తుందని వెల్లడించాడు.

తెలుగు రాష్ట్రాలు ఆర్ఎక్స్ 100 సినిమాను అద్భుతంగా ఆదరించాయనీ, పిల్లా రా పాటను విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నాయని కార్తికేయ అన్నాడు. సినిమాలో రకరకాల కేరెక్టర్లు ఉంటాయనీ, ప్రజలు చనిపోవాలని ఏ ఆర్టిస్టూ కోరుకోడని వ్యాఖ్యానించాడు. ఇద్దరు పిల్లలు దారితప్పుతుంటే వారిని సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నాడు.

కళాకారులు, డైరెక్టర్లను ఉగ్రవాదులుగా చూడటం సరికాదన్నాడు. ఇలాంటి బాధాక‌రమైన సంఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు త‌మ‌ను నెగెటివ్‌గా చూడ‌డం మానేసి, పిల్ల‌ల‌ను స‌న్మార్గంలో న‌డిపించేలా ప్ర‌య‌త్నించాల‌ని సూచించాడు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ వీడియోను కార్తికేయ పోస్ట్ చేశాడు. అజ‌య్ భూప‌తి తెరకెక్కించిన ఈ బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోగా కార్తికేయ‌, హీరోయిన్ గా పాయ‌ల్ రాజ్‌పుత్‌ నటించారు. రావు రమేశ్ కీలకపాత్రలో నటించారు.

RX100
Tollywood
ajay bhupati
kartikeya
payal rajput
Jagtial District
suicide
inspiration
Police
Twitter
video
  • Error fetching data: Network response was not ok

More Telugu News