Pakistan: హతవిధీ.. భారత్‌ను ఇరికించబోయి బొక్కబోర్లా పడిన పాకిస్థాన్!
- భారత్‌కు వ్యతిరేకంగా 20 స్టాంపులు ముద్రించిన పాక్
- తమకు వ్యతిరేకంగా కశ్మీరీ పండిట్లు చేసిన ఆందోళనను కూడా ముద్రించిన వైనం
- ఐరాస దృష్టికి తీసుకెళ్లిన ‘రూట్స్ ఇన్ కశ్మీర్’
పాపం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి ఏదీ కలిసొచ్చినట్టు లేదు. భారత్‌ను ఇరికించాలని ప్రయత్నించి తాజాగా బొక్కబోర్లా పడింది. కశ్మీర్‌లో భారత్ అత్యాచారాలకు పాల్పడుతోందని, పౌరులను హింసిస్తోందని ఆరోపిస్తూ అందుకు సంబంధించిన పోస్టల్ స్టాంపులను విడుదల చేసింది. 20 పోస్టల్ స్టాంపులున్న 20 వేల షీట్లను ముద్రించింది. కశ్మీర్ ప్రజలపై భారత్ అట్రాసిటీలకు పాల్పడుతోందని ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించింది.
అయితే, పొరపాటున పాకిస్థాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కశ్మీర్ పండిట్లు ఆందోళన చేస్తున్న ఫొటోలను కూడా స్టాంపుల్లో ముద్రించింది. దీనిపై కశ్మీర్ త్వరలోనే పాకిస్థాన్ అవుతుంది అని ఉర్దూలో రాసుకొచ్చింది. ఈ పోస్టల్ స్టాంపు చూసిన రూట్స్ ఇన్ కశ్మీర్ (ఆర్ఐకే) అనే సంస్థ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌కు లేఖ రాసింది.
పాకిస్థాన్ స్పాన్సర్డ్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కశ్మీర్ పండిట్లు చేస్తున్న ఆందోళనను పాకిస్థాన్ తన స్టాంపులపై ముద్రించుకుందని, ఇప్పటికైనా పాక్ దురాగతాలను గుర్తించాలని కోరింది. ఆరేడేళ్ల క్రితం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కశ్మీర్ పండిట్లు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నప్పటి ఫొటో అదని ఐరాసకు రాసిన లేఖలో పేర్కొంది.
ఈ విషయంలో కలుగజేసుకుని పాకిస్థాన్ ఆ స్టాంపులను ఉపసంహరించుకునేలా ఆదేశించడంతోపాటు కశ్మీరీ పండిట్లకు క్షమాపణ చెప్పించాలని ఆర్ఐకే డిమాండ్ చేసింది.